రాజన్న సిరిసిల్ల జిల్లా : జాతీయ పంచాయతీ పురస్కారాల ప్రదానోత్సవంలో భాగంగా కేంద్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు గిరిరాజ్ సింగ్ నుంచి జిల్లాలోని గంభీరావుపేట మండలం గంభీరావుపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ కటకం శ్రీధర్ , పంచాయతీ కార్యదర్శి మజీద్ లు పురస్కారాన్ని అందుకున్నారు.సోమవారం న్యూఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో నిర్వహించిన జాతీయ పంచాయతీ అవార్డుల ప్రదానోత్సవం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన జరిగింది.
ఇందులో భాగంగా స్వయం సమృద్ధి మౌలిక వసతులు కలిగిన గ్రామ పంచాయతీల విభాగంలో జిల్లాలోని గంభీరావుపేట గ్రామ పంచాయతీ దేశంలోనే మూడో స్థానంలో నిలిచి అవార్డు కైవసం చేసుకుంది.షీల్డు, ప్రశంస పత్రంతో పాటు రూ.50 లక్షల నగదును రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సమక్షంలో కేంద్ర మంత్రి గంభీరావుపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ కటకం శ్రీధర్ , పంచాయతీ కార్యదర్శి మజీద్ లకు అందజేశారు.అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో , స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా పంచాయతీ అధికారి రవీందర్ పాల్గొన్నారు.







