రాజన్న సిరిసిల్ల జిల్లా :75వ గణతంత్ర దినోత్సవం( Republic Day ) సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla District )కేంద్రం లోని కొత్త చెరువు బండ్ అండ్ పార్క్ లో జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక సంబురాలు అంబరాన్ని తాకాయి.ఈ వేడుకలకు జెడ్పీ చైర్ పర్సన్ న్యాలకంటి అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా విద్యార్థుల నృత్యాలు, పాటలు అతిథులు, ప్రజలను ఆకట్టుకున్నాయి.ఆట.పాటల హోరు.సరస్వతి శిశు మందిర్, టీఎస్ఎంఎస్ మైనార్టీ స్కూల్, జెడ్పీ హెచ్ ఎస్ వీర్నపల్లి, కేజీబీవీ వేములవాడ, రెయిన్ బో హై స్కూల్ సిరిసిల్ల, టీ ఎస్ డబ్ల్యూ ఆర్ఎస్ బద్దెనపల్లి, జడ్పీహెచ్ఎస్ శివనగర్ సిరిసిల్ల, కేంద్రీయ విద్యాలయం సిరిసిల్ల, నర్సింగ్ కళాశాల, సెలెస్టియల్ హైస్కూల్ విద్యాలయాల విద్యార్ధులు దేశ భక్తి గీతాలు, జానపద గేయాలు, పర్యావరణం పై అవగాహన కల్పించే, తెలంగాణ బోనాలు, దైవ భక్తి పాటలతో హోరెత్తించారు.
ఈ సందర్భంగా ఉత్తమ ప్రదర్శనలు ఇచ్చిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.
సకినాలు .బబ్బెర గుడాలు.ఉత్సవాల్లో భాగంగా ‘మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్’ఏర్పాటు చేశారు.
సకినాలు, గారెలు, పోలెలు, రాగి లడ్డూలు, జావ, బబ్బెర గుడాలు, అరిసెలు, మిల్లెట్ వంటకాలు సిద్ధంగా ఉంచారు.ఆయా వంటకాల గురించి, పోషక విలువలను తెలుసుకుని, రుచులను అతిథులు, అధికారులు, పిల్లలు ఆస్వాదించారు.
ఉత్తమ ప్రతిభ చూపిన ఐసీడీఎస్ ఉద్యోగులకు బహుమతులను కలెక్టర్ అందజేసి, అభినందించారు.సంక్షేమ శాఖ, విద్యా శాఖ , వైద్య శాఖ అధ్వర్యంలో ఒక స్టాల్ ను ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, ట్రైనీ ఎస్పీ రాహుల్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, సిరిసిల్ల ఆర్డీఓ ఆనంద్ కుమార్, మున్సిపల్ కమిషనర్ అయాజ్ తదితరులు పాల్గొన్నారు.