ఓ భారీ అవినీతి తిమింగళం ఐటీ వలకు చిక్కింది.కోట్ల రూపాయాల పన్ను ఎగవేసి ప్రభుత్వ ఆదాయానికి గండికొడతామనుకున్న ఓ వ్యాపారి అక్రమ సంపద పుట్టను పగలగొట్టారు ఆదాయపన్ను అధికారులు.
దాదాపు 39 గంటల పాటు సోదాలు చేపట్టి.వ్యాపారి అక్రమ సంపద భాగోతాన్ని బయటపెట్టారు.
దాదాపు 8 కోట్ల నగదు, కిలోల కొద్ది బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు.ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
పక్కా సమాచారం అందుకున్న ఐటీ శాఖ అధికారులు.వ్యాపారి శంకర్‌రాయ్ ఇంట్లో సోదాలు చేపట్టారు.
తనిఖీల్లో కళ్లు బైర్లు కమ్మే విషయం వెలుగులోకి వచ్చింది.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 కోట్ల నగదును అక్రమంగా దాచినట్లు అధికారులు గుర్తించారు.
ఈ నగదుకు ఎటువంటి లెక్కపత్రం లేకపోవడంతో సీజ్ చేశారు.అంతకు ముందు ఆదాయశాఖ పన్ను అధికారుల రాకను గమనించిన వ్యాపారి శంకర్ రాయ్ కోటి రూపాయల నగదు ఉన్న బ్యాగ్‌ను నీటి సంపులో పడేశాడు.
దీన్ని గమనించిన అధికారులు సంపు నుంచి బ్యాగ్‌ను వెలికి తీశారు.అందులో ఉన్న కోటి రూపాయల నగదు తడిచిపోయింది.
దీంతో వాటిని డ్రైయర్ సహాయంతో ఆరబెట్టారు.అలాగే మరో రూ.5 కోట్ల విలువైన నగలను స్వాధీనం చేసుకున్నారు.మొత్తంగా 39 గంటల పాటు తనిఖీ చేసి 8 కోట్ల నగదు, రూ.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను సీజ్ చేశారు.అలాగే పలు విలువైన పత్రాలనూ స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.కోట్ల రూపాయల నగదు.కిలోల కొద్ది దొరికిన బంగారు నగల వివరాలపై ఐటీ అధికారులు కూపీ లాగుతున్నారు.ఎవరి పేరుతో ఆస్తులు కొనుగోలు చేశారు.? ఎక్కడెక్కడ కొనుగోలు చేశారన్న దానిపై వ్యాపారి శంకర్ రాయ్‌ను ఆరా తీస్తున్నారు.