ఉనికి కోసం పోరాడుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీకి కరోనా వైరస్ బాగా కలిసి వచ్చినట్లు గా కనిపిస్తోంది.మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉన్నా ఏపీలో కరోనా వైరస్ కంటే రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.
ముఖ్యంగా ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడం, అదే సమయంలో వైసీపీ ప్రభుత్వం సమర్థవంతంగా పని చేయడం లేదనే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.కేవలం తమకు రాజకీయాలే ముఖ్యం అన్నట్టుగా అధికార పార్టీ వ్యవహరిస్తుండడం, అదే సమయంలో తెలుగుదేశం పార్టీ వైసిపి అనుసరిస్తున్న విధానాలపై విమర్శలు చేస్తూ వాటిని హైలెట్ చేయడంలోనూ సక్సెస్ అవుతోంది.
ఏపీలో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది.పరిస్థితి అదుపులోకి రాకపోగా, ప్రమాదకర రీతిలో కేసుల సంఖ్య పెరుగుతున్నాయి.
ప్రజల్లోనూ వైసీపీ ప్రభుత్వం కరోనాను కంట్రోల్ చేసే విషయంలో విఫలమైందనే భావం కూడా పెరిగిపోతోంది.
ఈ సమయంలో హైదరాబాదులో ఉన్న చంద్రబాబు తన ఇంటి నుంచి ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు.
నిత్యం పార్టీ శ్రేణులతో, మీడియాతోను వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.ఏపీ ప్రభుత్వం వద్ద పుష్కలంగా నిధులు ఉన్నా, వాటిని ఖర్చు చేయడం లేదని, పేదలు, వలస కూలీల పట్టించుకోవడం లేదని, టిడిపి ప్రధానంగా ఆరోపణలు చేస్తోంది.
కేంద్రం అన్ని రాష్ట్రాలకు నిధులు విడుదల చేసిందని, వాటి లెక్కలు చెప్పాలంటూ, అసలు ఇప్పటి వరకు కరొనకు సంబంధించి తీసుకున్న చర్యలు, పెట్టిన ఖర్చుల వివరాలకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని టిడిపి గట్టిగానే డిమాండ్ చేస్తోంది.
అక్కడితో ఆగకుండా, టిడిపి నాయకులు తమ ఇళ్ల వద్దే దీక్షలకు దిగేలా టీడీపీ ప్లాన్ చేసింది.
స్థానిక సమస్యలతో పాటు పేదలకు ఐదు వేల రూపాయలు ఇవ్వాలంటూ నాయకులు దీక్షలకు దిగుతూ వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రజల్లో వచ్చేలా చేస్తున్నారు.ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో టిడిపి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఒకరోజు దీక్ష కొనసాగించారు.
విడతలవారీగా టిడిపి నేతలు వివిధ సమస్యలపై దీక్షలకు దిగుతూ వాటిని మీడియాలో హైలెట్ చేసుకుంటున్నారు.అలాగే ఏపీలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తున్నా, రోజురోజుకు కేసుల సంఖ్య తీవ్రంగా పెరుగుతున్నా, వాటి లెక్కలను ప్రభుత్వం బయటపెట్టకుండా దాచి పెడుతోందని,టెస్ట్ ల సంఖ్యను పెంచాలని టిడిపి డిమాండ్ చేస్తోంది.

అలాగే విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో కేసుల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారని టిడిపి ఆరోపణలు చేస్తోంది.అలాగే టెస్టింగ్ కిట్లు కొనుగోలులోనూ వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, ఇలా అనేక రకాల ఆరోపణలతో టిడిపి విరుచుకుపడుతోంది.ఆ పార్టీ సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో వైసిపి నాయకులు ఉండిపోతున్నారు.కరోనా పోరులో వైసీపీ ప్రభుత్వం కంటే టిడిపి సమర్థవంతంగా పని చేస్తుందనే గుర్తింపు తెచ్చుకునే విధంగా టిడిపి నాయకులు ప్రయత్నిస్తూ బాగానే సక్సెస్ అవుతున్నారు.
మొత్తంగా చూసుకుంటే కరోనా తెలుగుదేశం పార్టీకి బాగానే మేలు చేసినట్లుగా కనిపిస్తోంది.