పార్టీ శ్రేణులకు శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయాలి.ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థుల జాబితా ప్రకటించాలి.
పార్టీలో సోషల్ మీడియాను పటిష్ఠం చేయాలి.-డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్.
సూర్యాపేట జిల్లా:కాంగ్రెస్ పార్టీలో శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయాలని,జిల్లా,మండల,గ్రామ స్ధాయిలో పార్టీ శ్రేణులకు శిక్షణ ఇవ్వాలని బుధవారం జరిగిన పార్టీ నవ సంకల్ప మేధో మధన సదస్సులో తీర్మానం చేసినట్లు డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ అన్నారు.పార్టీలో సోషల్ మీడియాను పటిష్ఠం చేయాలని,మీడియా విభాగాలను ఏర్పాటు చేయాలని తీర్మానం చేసినట్లు ఆయన చెప్పారు.
జిల్లా కాంగ్రెస్ పార్టీ నవ సంకల్ప మేధో మధన సదస్సును కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మార్గదర్శనంలో డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ అధ్యక్షతన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నందు బుధవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆరు గ్రూప్ లుగా ఏర్పడి రాష్ట్రంలో, జిల్లాలో పార్టీ పటిష్టత కొరకు తీసుకోవలసిన చర్యలపై సుధీర్ఘంగా చర్చించారు.
ఇటీవల హైదరాబాద్ లో టిపిసిసి ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో తీసుకున్న నిర్ణయాలపై చర్చించారు.పార్టీ రాష్ట్ర స్ధాయి,జిల్లా స్ధాయి,మండల,గ్రామ స్ధాయి నాయకులు పాల్గొన్న ఈ సమావేశంలో పార్టీ పటిష్టత కొరకు పలు తీర్మానాలు చేసినట్లు డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ తెలిపారు.
ఈ సదస్సులో చేసిన తీర్మానాలను టిపిసిసి అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు చదివి వినిపించారు.రాబోయే ఎన్నికలలో పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థుల జాబితాను ఆరు నెలల ముందే ప్రకటించాలని,పార్టీ మేనిఫెస్టో మూడు నెలల ముందు ప్రకటించాలని తీర్మానం చేశారు.
పార్టీలో క్రమశిక్షణను అతిక్రమించిన వారిపై చర్యలు చేపట్టాలని తీర్మానం చేశారు.పార్టీలో ఇతర పార్టీల నుండి చేరికల పర్యవేక్షణ కొరకు జిల్లా స్ధాయిలో చేరికల కమీటి ఏర్పాటు చేయాలని,కమిటీ ఆమోదం తీసుకుని చేరికలు నిర్వహించాలని తీర్మానం చేశారు.
పార్టీలో అంతర్గతంగా ప్రోటోకాల్ పాటించాలని,గ్రామ కమిటీలు నెలకు ఒకసారి, మండల కమిటీలు రెండు నెలలకు ఒకసారి,జిల్లా కమిటీ మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా సమావేశం కావాలని తీర్మానం చేశారు.ప్రతి మండల కేంద్రంలో తప్పనిసరిగా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయాలని,జిల్లా కేంద్రంలో కూడా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు.
ఎస్సి,ఎస్టిలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ లు కల్పించాలని, పార్టీలో 50% పదవులు యువతకు,33% మహిళలకు ఇవ్వాలని,ఎస్సి,ఎస్టి సబ్ ప్లాన్ అమలు చేయాలని, ఓబిసి సబ్ ప్లాన్ అమలు చేయాలని,దేవాదాయ, వక్ఫ్ బోర్డు భూములకు చట్టపరమైన రక్షణ కల్పించాలని తీర్మానం చేశారు.కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే నల్లధనం వెలికి తీస్తామని, బ్యాంకులు కార్పొరేట్ సంస్ధలకు మాఫీ చేసిన వేలకోట్ల రూపాయలు తిరిగి వసూలు చేస్తామని ప్రకటించారు.
చిరు వ్యాపారులకు రుణాలు ఇవ్వాలని,ఇన్ కమ్ టాక్స్ ఆదాయ పరిమితి పెంచాలని,జి ఎస్ టి విధానం రద్దు చేయాలని,సహకార వ్యవస్థ పటిష్ఠం చేయాలని,సహకార డైరీ రంగాన్ని పటిష్ఠం చేయాలని,అర్హులైన వారందరికి ఇండ్లు కట్టించి ఇవ్వాలని,వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు.రేషన్ దుకాణాల ద్వారా తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులు సరపరా చేయాలని,ప్రతి ఇంటికి ఆరు సిలిండర్ లు ఉచితంగా ఇవ్వాలని అసంఘటిత కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని,ప్రతి సంవత్సరం ఉద్యోగ నియామకాలపై క్యాలెండర్ విడుదల చేయాలని, ఉద్యోగ అర్హత వయసు దాటిన వారికి నిరుద్యోగ భృతి ఇవ్వాలని తీర్మానం చేశారు.
ఈ సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు అంజద్ అలీ,వివిధ విభాగాల నాయకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.