టీడీపీ అధినేత చంద్రబాబు , ఆయన కుమారుడు లోకేష్ గత కొద్ది రోజులుగా బాగా యాక్టివ్ అయ్యారు.పార్టీ కేడర్ లో ఉత్సాహం నింపేందుకు రకరకాల మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు.ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో, వైసీపీ ప్రభుత్వం పై జనాల్లో కాస్త వ్యతిరేకత పెరిగిందనే సంకేతాలు వెలువడటం తదితర కారణాలతో చంద్రబాబు, లోకేష్ జనం బాట పట్టారు.
తమదైన శైలిలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా పార్టీ కేడర్ లో వైసీపీ ప్రభుత్వం పై భయం పోగొట్టే విధంగా రకరకాల ప్రసంగాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు పార్టీ కేడర్ లోను చర్చనీయాంశంగా మారాయి. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాదుడే బాదుడు కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు.
ఈ మేరకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి గోదావరి జిల్లాల వరకు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టారు.ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు, లోకేష్ చేసిన వ్యాఖ్యలు పార్టీ కేడర్ కు గందరగోళం కలిగిస్తున్నాయి.
పార్టీ క్యాడర్ ను ఉద్దేశించి మాట్లాడుతూ కార్యకర్తల మీద ఎన్ని కేసులు ఉంటే వాళ్లను పార్టీ అంతగా ప్రోత్సహిస్తుందని , టిడిపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వారికి అంతగా ప్రాధాన్యం ఇస్తామని, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేడర్ పై నమోదైన కేసులను సమీక్షించే విధంగా ప్రత్యేక ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు.

అలాగే వైసిపి నాయకుల పైన కేసులు నమోదు చేసి అందరినీ జైలుకు పంపుతామని లోకేష్ వంటి వారు వ్యాఖ్యానిస్తున్నారు.అంతే కాదు పార్టీ కేడర్ పై ఎన్ని కేసులు ఉంటే, అంత బాగా పని చేసినట్లు అని, కనీసం 13 కేసులు ఉన్న వారితో మాత్రమే తాను మాట్లాడతానని , అంతకన్నా తక్కువ కేసులో ఉన్న వారు తన దగ్గరకు రావద్దు అంటూ లోకేష్ చెబుతుండడం విడ్డూరంగా మారింది.కొద్ది రోజుల క్రితం లోకేష్ వద్ద కు కొంత మంది కార్యకర్తలు వెళ్లి కలిశారు.
తమపై వైసిపి నాయకులు పెట్టిన కేసులు అంశాన్ని ప్రస్తావించడంతో… తనపైనా ప్రభుత్వం కేసులు పెట్టిందని మొత్తం 11 కేసులు ఉన్నాయని, తాను పోరాడుతున్న విధంగానే పార్టీ కేడర్ కూడా పోరాడాలని పిలుపునిచ్చారు.

చంద్రబాబు , లోకేష్ పైన ఏవైనా కేసులు ఉంటే వాటిని వాదించేందుకు ప్రత్యేక బృందం ఉంటుంది కానీ సామాన్య కార్యకర్తలపై కేసులు నమోదైతే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి.ప్రత్యేకంగా లాయర్ ను ఏర్పాటు చేసుకోవడం తో పాటు వారికి చెల్లించాల్సిన ఫీజులు , కుటుంబ భారం ఇలా ఎన్నో అంశాలు లెక్క లోకి వస్తాయి.కానీ వీటి గురించి ప్రస్తావించకుండా ఎన్ని కేసులు ఉంటే అంత గొప్ప నాయకుడు అన్నట్లుగా లోకేష్ వంటి వారు మాట్లాడుతూ ఉండడం పార్టీ కేడర్ ను సైతం అయోమయానికి గురి చేస్తోంది.







