ఒకప్పుడు గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలను గుర్తుపెట్టుకుని వారికి అండగా ఉండాలి.అప్పుడే పార్టీ కోసం ప్రాణాలకు తెగించి పోరాడతారు.
తమ నాయకుడి కోసం రిస్క్ తీసుకుంటారు.కార్యకర్తలు లేనిదే ఏ పార్టీ బలంగా మారలేదు.
ఏ నాయకుడు కూడా పట్టు సాధించలేడు.అలాంటి కార్యకర్తలను అధికారం చేజిక్కించుకున్నాక పట్టించుకోవడమే మానేస్తున్నారు.
ప్రస్తుతం ఏపీలో వైసీపీ కార్యకర్తల పరిస్థితి అలాగే ఉందని అంటున్నారు విశ్లేషకులు.ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలపై కార్యకర్తలు గుర్రుగా ఉన్నారట.
తమ నేత గెలుపు కోసం కష్టపడి పనిచేస్తే తమను పట్టించుకోవడం లేదన్న బాధలో చాలా మందిలో ఉందని అంటున్నారు.గత ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం ప్రాణాలు తెగించి పోరాడిన కార్యకర్తలను సయితం ప్రస్తుత ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదట.అధినాయకత్వంతో తమ బాధ చెప్పుకునే పరిస్థితి అవకాశం కూడా ఇవ్వడం లేదట.
రేపు ముఖ్య కార్యకర్తలతో…
కాగా తాజాగా కార్యకర్తలతో మాట్లాడటానికి సీఎం జగన్ సిద్దమయ్యారు.రేపు జరగబోయే సమావేశానికి ప్రతి నియోజకవర్గం నుంచి యాబై మంది ముఖ్య కార్యకర్తలతో జగన్ సమావేశం అవుతున్నారు.అయితే ఇందులో ఎక్కువ మంది ఎమ్మెల్యేలను వ్యతిరేకించే వారుంటే స్థానిక ఎమ్మెల్యేలకు ఇబ్బంది తప్పదని అంటున్నారు.
మరొక విషయం ఏంటంటే… అయితే నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల ఎంపిక కూడా ఎవరు చేస్తారన్న దానిపైనే ఆసక్తి నెలకొంది.నియోజకవర్గాల్లో ముఖ్యమైన కార్యకర్తలు కొందరు ఎమ్మెల్యేలకు దూరంగా ఉన్నారు.
వారిని సమావేశానికి పిలవకుంటే నియోజకవర్గంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులు జగన్ కు తెలిసే అవకాశం లేదు.అలాగని ఎమ్మెల్యేలను కాదని ఎవరు ఎంపిక చేస్తారన్నదే ఇప్పుడు అసలు సమస్య.
దీంతో నచ్చిన వారినే ఎంపిక చేస్తారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అయితే ఇందులో పార్లమెంటు సభ్యులు కొందరు జోక్యం చేసుకుని తమ వర్గానికి చెందిన ముఖ్య కార్యకర్తలను జగన్ తో జరిగే సమావేశానికి ఎంపిక చేయాలని వత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.చాలా చోట్ల పార్లమెంటు సభ్యులకు, శాసనసభ్యులకు మధ్య పొసగడం లేదు.ఎంపీలు లేకుండానే కార్యక్రమాలను కూడా నిర్వహించే వారు కొందరైతే, ఎంపీలు తమ నిధులతో జరిపే కార్యక్రమాలకు ఎమ్మెల్యేలు కూడా దూరంగా ఉండటం తెలిసిందే… అయితే నియోజకవర్గాలలో నెలకొన్న వాస్తవ పరిస్థితులు జగన్ కు తెలుస్తాయా…? లేదా…? ఎంపిక ఎలా జరుగుతుందని పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.ఎమ్మెల్యేల కారణంగా నియోజకవర్గంలో తలెత్తుతున్న ఇబ్బందులను వివరిస్తే కొంత వరకైనా దిద్దుబాటు చేసుకోవడానికి అవకాశముంటుంది.అలాకాకుండా వచ్చే ఎన్నికలకు సిద్ధమవ్వాలని, కష్టపడి పనిచేయండి అని జగన్ చెప్పి పంపితే మాత్రం సమస్యలు అలాగే ఉండిపోతాయి.
దీంతో ఎమ్మెల్యేలకు కార్యకర్తలకు ఏర్పిడిన గ్యాప్ మరింత పెరిగి ఎన్నికలపై ప్రభావం చూపుతాయిని అంటున్నారు.