సినీ నటుడు ఆలీ రాజకీయ అడుగులు ఎటువైపు అనే విషయంలో ఇప్పటి వరకు ఎవరికీ స్పష్టమైన క్లారిటీ దొరకలేదు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితంగా మెలుగుతూ వచ్చిన ఆలీ … ఆ తరువాత వైసీపీ అధినేత జగన్ ను కలవడం అప్పట్లో కలకలం రేపింది.
ఆ తరువాత ఏపీ సీఎం చంద్రబాబు ను సైతం కలిసి అందరిని గందరగోళానికి గురిచేశాడు.అసలు ఆలీ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాడో తెలియక తికమకపడుతుండగానే… తనకు టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇస్తాను అన్న పార్టీలోకి తాను వెళ్తానని మరో బాంబ్ పేల్చాడు.
ఆ తరువాత అంతా సైలెంట్ అయిపొయింది.ఈ తరుణంలో ఆయన టీడీపీ తరపున గుంటూరు తూర్పు అసెంబ్లీ టికెట్ కోసం తెర వెనుక ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు.
ఇప్పుడు ఆ టికెట్ ఆలీకే దక్కబోతోంది అని తెలుగుదేశం పార్టీలో చర్చ మొదలయ్యింది.

2014 ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మైనార్టీ యేతర అభ్యర్థి మద్ధాళి గిరిధర్‌కి టిక్కెట్ కేటాయించినా విజయం సాధించలేకపోవడంతో ఈ సారి ఆ టికెట్ ను మైనార్టీలకే కేటాయించాలని టీడీపీ అధినేత భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో గుంటూరు నగరంలో బంధుత్వం ఉన్న సినీ నటుడు ఆలీ పేరు ఎక్కువుగా వినిపిస్తోంది.అలీ ఇప్పటికే అనేక సార్లు ఈ సీటు విషయంలో చంద్రబాబు ని కలవడం … గత శనివారం విజయవాడలో ఆలీకి జరిగిన సన్మాన సమావేశంలో చంద్రబాబు పాల్గొని రాజకీయాల్లోకి వస్తే సహకరిస్తామని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఒకప్పుడు గుంటూరు తూర్పు నియోజకవర్గం టీడీపీకి కంచుకోటలా ఉండేది.రెండు సార్లు ఎస్‌ఎం జియావుద్దీన్ ఇక్కడ భారీ మెజార్టీతో అప్పటి కాంగ్రెస్ నేత మహ్మద్ జానీపై విజయం సాధించారు.అయితే 2004 లో ఈ నియోజకవర్గంపై టీడీపీ పట్టు కోల్పోయింది.ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన షేక్ సుభాని భారీ ఆధిక్యంతో గెలుపొందారు.అలానే 2009 లో కూడా జియావుద్దీన్ ఓటమి చెందారు.దీంతో 2014లో ఆయనను తప్పించి మైనార్టీయేతర అభ్యర్థి మద్దాళి గిరిధర్‌ని టీడీపీ రంగంలోకి దింపినా ఫలితం కనిపించలేదు.
ఇక్కడ తూర్పులో వైసీపీ అభ్యర్థి మహ్మద్ ముస్తఫా విజయం సాధించారు.అందుకోసమే ఇప్పుడు మైనార్టీ ఓటర్లు అధికంగా ఉన్న గుంటూరు తూర్పుని మైనార్టీని వర్గానికి చెందిన ఆలీకి కేటాయించి మళ్ళీ కంచుకోటగా మార్చుకోవాలని చంద్రబాబు భావిస్తున్నాడట.
మరికొద్ది రోజుల్లోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
.