రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలిచి తీరాలనే పట్టుదల ఆ పార్టీ అధినేత చంద్రబాబులో బాగా కనిపిస్తోంది.ఒంటరిగా వెళ్లడం ద్వారానో, లేక పొత్తులతోనో అన్నది పక్కన పెట్టి అధికారంలోకి వచ్చి తీరాలనే పట్టుదలతో ఉన్న బాబు, పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అనేక కార్యక్రమాలను ఎప్పటికప్పుడు రూపొందిస్తున్నారు.
ఇప్పటికే ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తూ బాదుడే బాదుడు, ఇదేం కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమాలను రూపొందించి జనాల్లోకి వెళ్లారు.దీనిపైన విశేష స్పందన రావడంతో , ఈ తరహా కార్యక్రమాలను వరుసగా నిర్వహించాలని బాబు భావిస్తున్నారు.
అలాగే తన కుమారుడు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్రకు స్పందన అంతంత మాత్రమే అన్నట్టుగా ఉండడం, లోకేష్ పాదయాత్రలో తప్పులు దొర్లుతుండడం, ఆయన ప్రసంగాలపై మీడియా, సోషల్ మీడియాలో సెటైర్లు పడుతుండడం , లోకేష్ యాత్రలో జనాలు అంతంత మాత్రంగానే ఉండడం, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటున్న బాబు లోకేష్ పాదయాత్ర వల్ల పెద్దగా కలిసి వచ్చేదేమి లేదనే నిర్ణయానికి వచ్చిన బాబు తానే ఇక రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారట.
ఈ మేరకు ఈనెల 15 ,16, 17 తేదీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు.మూడు రోజులపాటు ఇదేమి కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీదే విజయం అనే సాంప్రదాయం వస్తూ ఉండడంతో, ఈ జిల్లా పైన చంద్రబాబు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారట.
అలాగే జనసేనతో పొత్తు ఖరారు అయ్యే అవకాశాలు ఉండడంతో, ఈ జిల్లా నుంచి ఎక్కువ సీట్లు జనసేనకు కేటాయించాల్సి ఉన్న నేపథ్యంలో చంద్రబాబు ఇక్కడ జనసేనకు కేటాయించబోయే సీట్ల గురించి పార్టీ నాయకులకు క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తరువాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పర్యటించేందుకు చంద్రబాబు షెడ్యూల్ రెడీ చేసుకుంటున్నారు.ఈ విధంగా ఎన్నికల సమయం వరకు నిరంతరం జనాల్లోనే ఉండే విధంగా బాబు ప్రయత్నాలు మొదలుపెట్టారట.