ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి.సార్వత్రిక ఎన్నికలకు సమయం చాలానే ఉన్నా, ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం రాజకీయ పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ముఖ్యంగా ఈ విషయంలో టిడిపి అలర్ట్ గా ఉంది.కచ్చితంగా జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనతో ఉన్నారని బలంగా నమ్ముతోంది.
ఇదే విషయాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పదే పదే ప్రస్తావిస్తున్నారు.దీనికి కారణం జగన్ ఇటీవల కాలంలో ఎక్కువగా జనాల్లోకి వచ్చేందుకు ప్రయత్నించడంతో పాటు, భారీ బహిరంగ సభలు నిర్వహిస్తుండడం, కులాల వారిగా మీటింగులు, అలాగే ప్రతిపక్షాలపై సెటైర్లు వేయడం, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు సవివరంగా వివరిస్తూనే ప్రతిపక్షాలకు దీటుగా సమాధానం చెబుతుండడం వంటివన్నీ బాబు పరిగణలోకి తీసుకుంటున్నారు.
జగన్ చేస్తున్న ప్రసంగాలు జనాల్లోకి వెళుతుండడం, బాబుకు మరింత కంగారు పుట్టిస్తోంది.అందుకే వైసిపి ప్రభుత్వ విధానాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, సంక్షేమ పథకాల అమలులో లోపాలను ప్రశ్నిస్తూ … బాదుడే బాదుడు, ఇదేం కర్మ మన రాష్ట్రానికి వంటి వినూత్న కార్యక్రమాలతో జనాల్లోకి టిడిపి శ్రేణులు వెళ్లే విధంగా చేస్తున్నారు.
ఇప్పటికే కర్నూలు జిల్లాలో బాబు పర్యటించారు.ఆ తర్వాత ఉమ్మడి పశ్చిమ , తూర్పుగోదావరి జిల్లాలో ఆయన పర్యటించారు.త్వరలోనే కృష్ణా జిల్లాలోనూ అనేక కార్యక్రమాలు చేపట్టేందుకు బాబు ప్లాన్ చేసుకుంటున్నారు .వచ్చే ఏడాది మే లేదా అక్టోబర్ లో ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని బాబు ప్రకటించారు.

వైసిపి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మరింత పెరగడంతోనే, ఆ వ్యతిరేకతను తగ్గించుకునేందుకు జగన్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతో ఉందని బాబు ప్రస్తావిస్తున్నారు.ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో నిర్వహించిన సమీక్షలో బాబు ఈ విషయాలను ప్రకటించారు.ఏపీలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగినా, ముందస్తు ఎన్నికలకు వెళ్లినా, వైసీపీ చిత్తుగా ఓడిపోతుందని బాబు మరోసారి వ్యాఖ్యానించారు.13వ తేదీ దాటినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో వైసిపి ప్రభుత్వం ఉందని విమర్శించారు.వైసిపి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, ఉద్యోగుల్లోనూ ఆ సంతృప్తి బయటపడుతోందని, జగన్ ప్రభుత్వ విధానాలతో ఏపీ దివాలా తీసింది అని బాబు మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు.ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని బాబు పదేపదే పార్టీ నేతలకు సూచిస్తున్నారు.