అతి అనర్ధం అన్నారు పెద్దలు.! అతి వల్ల అభాసుపాలు కావటమే కాని అందలం ఎక్కే వ్యవహారం లేనే లేదు అన్నది పండితుల మాట.! కానీ ఈ కాలం జనాలకు ఇలా చెబితే చెవికి ఎక్కదు కదా ! ఆ అతివల్ల ఇబ్బంది పడితే తప్ప జాగ్రత్త పడరు.ప్రస్తుత కాలంలో అతిగా వాడేస్తుంది ఏదైనా ఉందా అంటే అది సెల్ ఫోన్ వాడకమే.
ఇప్పుడు ఎవరు చూసినా ఖాళీగా ఉండడం లేదు స్మార్ట్ ఫోన్ లో ఎదో చూస్తూ… ఏదో వెతుకుతూ కనిపిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది ఓ మహిళకు.వారం రోజులపాటు అదేపనిగా స్మార్ట్‌ఫోన్ వాడటంతో ఆమె చేతి వేళ్లు పని చేయకుండా పోయాయి.ఈ సంఘటన చైనాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే… చాంగ్షా పట్టణానికి చెందిన ఓ మహిళ వారం రోజుల పాటు ఆఫీస్‌కు సెలవు పెట్టింది.ఈ ఖాళీ సమయంలో పూర్తిగా తన ఫోన్ లోనే మునిగిపోయింది.
కేవలం నిద్ర పోయేటప్పుడు తప్ప మిగతా సమయమంతా ఫోన్‌తోనే గడిపింది.

ఇంకేముంది.కొన్ని రోజుల తర్వాత ఆమె కుడి చేతిలో తీవ్రమైన నొప్పి రావడమే కాక చేతి వేళ్లి ఫోన్‌ని పట్టుకునే పోజిషన్‌లోనే బిగుసుకు పోయాయంట.వాటిని కొంచెం కూడా కదిలించడానికి రాకపోవడంతో ఆస్పత్రికి పరుగు తీసింది.
ఆమెని పరీక్షించిన డాక్టర్లు సదరు మహిళ ‘టెనోసినోవిటీస్’(రోజుల తరబడి చేతులను ఒకే విధంగా వాడటం వల్ల వచ్చే వాపు)తో బాధపడుతుందని తేల్చారు.అనంతరం వైద్యం చేసి ఆమె చేతి వేళ్లను సాధారణ స్థితికి తీసుకొచ్చారు.