హిందుత్వ భావజాలం కలిసిన బీజేపీ నేత,కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కి కేంద్ర హోం మంత్రి అమిత్ షా గట్టి వార్ణింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది.మొన్నటి కి మొన్న హోం శాఖ సహాయక మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలపై షా కిషన్ రెడ్డిని మందలించిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు తాజాగా గిరిరాజ్ సింగ్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తో షా రంగంలోకి దిగి గిరి రాజ్ కు గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది.పార్టీని, భాగస్వామ్య పార్టీలతో సంబంధాలను చిక్కుల్లో పెట్టే విధంగా అనవసర వ్యాఖ్యలు చేయవద్దని.
ఇలాంటి తప్పులు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని అమిత్ షా కేంద్రమంత్రి గిరిరాజ్‌ను హెచ్చరించారు.బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న బీజేపీ, ఎల్జేపీ నేతలను ఎగతాళి చేస్తూ గిరిరాజ్ సింగ్ ఓ ట్వీట్ చేశారు.

నితీష్‌తో కలిసి సుశీల్‌కుమార్ మోదీ, రామ్‌విలాస్ పాశ్వాన్, చిరాగ్ పాశ్వాన్ చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోలను ఆయన షేర్ చేస్తూ ‘నవరాత్రి రోజుల్లో ఫలాహారం ఏర్పాటు చేసి ఇలాంటి ఫొటోలు తీసుకుంటే అవి ఎంత అందంగా ఉండేవో!.మనం మన మతానికి సంబంధించిన కర్మ, ధర్మాలను ఆచరించడంలో నిరాసక్తంగా ఉంటాం కానీ వేరే మతంపై ప్రేమను నటించడంలో ముందుంటాం’ అని రాశారు.అయితే గిరిరాజ్ ట్వీట్‌పై జేడీయూ, ఎల్జేపీ నేతలు అసంతృప్తి, విమర్శలు వ్యక్తం చేయడంతో అమిత్ షా రంగంలోకి దిగి భవిష్యత్తు లో మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే బాగోదు అంటూ ఘాటుగా హెచ్చరించినట్లు తెలుస్తుంది.ఇప్పటికే బీజేపీ, జేడీయూ మధ్య దూరం పెరుగుతున్న ఈ సమయంలో గిరిరాజ్ వ్యాఖ్యలు అగ్నికి మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది.







