ఇటీవలే వైసీపీకి చేయిచ్చి టీడీపీలో చేరిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మరోమారు తన నిజ స్వరూపాన్ని చాటుకున్నారు.మీడియా ప్రతినిధిపై దాడి చేయించడమే కాక ‘‘ఎక్కువ మాట్లాడకు… జైల్లో పెట్టిస్తే బెయిల్ కూడా రాదు’’ అని బెదిరించారు.దీంతో బిత్తరపోయిన సదరు మీడియా ప్రతినిధి జలీల్ ఖాన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.వివరాల్లోకెళితే… నగరంలోని తారాపేటలోని జలీల్ ఖాన్ కార్యాలయానికి సమీపంలోని ప్రధాన రహదారిని విస్తరించాలని అధికారులు నిర్ణయించారు.
రోడ్డు విస్తరణలో మసీదు, ముస్లిం శ్మశానవాటిక చాలా భాగం నష్టపోనున్నాయి.ఈ నేపథ్యంలో ముస్లిం ప్రముఖులు శ్మశాన వాటిక వద్ద నిన్న రాత్రి సమావేశమయ్యారు.అయితే, తనకు చెప్పకుండా సమావేశం కావడమేంటని ఆగ్రహం వ్యక్తం చేసిన జలీల్ ఖాన్ అక్కడికి వెళ్లి అందరినీ బూతులు తిట్టారు.ఆ సమయంలో అటుగా వెళుతున్న విజయవాడ ప్రెస్ క్లబ్ కోశాధికారి, కాకతీయ పత్రిక సంపాదకుడు షఫీ… అక్కడికి వెళ్లి తన సెల్ ఫోన్ తో ఫొటోలు తీయడం ప్రారంభించారు.
దీనిని గమనించిన జలీల్ ఖాన్… ‘‘ఎవడ్రా ఫొటోలు తీస్తోంది… వాడిని కుమ్మండ్రా’’ అని తన అనుచరులకు ఆదేశాలు జారీ చేశారు.దీంతో వారంతా షఫీపై భౌతిక దాడికి దిగారు.
ఆయన ఫోన్ ను ధ్వంసం చేశారు.ఎమ్మెల్యేతో షఫీ మాట్లాడబోగా ‘‘ఎక్కువ మాట్లాడకు… జైల్లో పెట్టిస్తే బెయిల్ కూడా రాదు’’ అని జలీల్ ఖాన్ ఊగిపోయారు.
దీంతో చేసేది లేక అక్కడి నుంచి బయటపడ్డ షఫీ… జలీల్ ఖాన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
.






