కరోనా మహమ్మారి కోరలు చాస్తుండటంతో జూన్ 21 వరకు దేశవ్యాప్తంగా రెండోసారి లాక్‌డౌన్ విధించింది యూకే ప్రభుత్వం.దీనికి కారణం కరోనా స్ట్రెయిన్.
పాత వైరస్ కంటే వేగంలో, వ్యాప్తిలో ఇది ప్రమాదకరమని నిపుణులు హెచ్చరించడంతో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా లాక్‌డౌన్‌ను విధించారు ప్రధాని బోరిస్ జాన్సన్.అంతా బాగానే వున్నప్పటికీ ఆంక్షలు ఏ విధంగా ఎత్తివేయాలన్న దానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.
ఈ క్రమంలో నిపుణులు, ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలతో చర్చించి లాక్‌డౌన్‌ను ఎలా ఎత్తివేయాలన్న దానిపై ప్రణాళిక రూపొందించారు ప్రధాని .
సుధీర్ఘ కసరత్తు అనంతరం నాలుగు దశల్లో కోవిడ్ లాక్‌డౌన్ ఆంక్షలను ఎత్తివేసేందుకు ఉద్దేశించిన రోడ్ మ్యాప్‌ను ఆయన సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.దేశంలో కోవిడ్ కేసులు నియంత్రణలో వుంటే ముందుగా ప్రకటించిన జూన్ 21 కంటే ముందే చాలా ఆంక్షలను ఎత్తివేస్తామని బోరిస్ జాన్సన్ తెలిపారు.ప్రస్తుత ‘స్టే ఎట్ హోం’పిలుపును మార్చి 29వ తేదీ నుంచి ‘స్టే లోకల్’కు మారుస్తామని చెప్పారు.అయితే కేసులు అనూహ్యంగా పెరిగిన పక్షంలో అవసరమైతే మళ్లీ కోవిడ్ ఆంక్షలను విధించే అవకాశం వుందని ప్రధాని స్పష్టం చేశారు.
రోడ్ మ్యాప్ ఇదే:
మొదటి దశ: మార్చి 8వ తేదీ నుంచి అన్ని వయస్సుల విద్యార్థులకు స్కూళ్లు, యూనివర్సిటీలు ప్రారంభం.
రెండో దశ: ఏప్రిల్ 12 నుంచి అత్యవసరం సర్వీసుల్లో లేని దుకాణాలు, ఔట్‌డోర్ డైనింగ్, బీర్ గార్డెన్స్‌కు అనుమతి
మూడో దశ: మే 17వ తేదీ నుంచి పబ్‌లు, సినిమా థియేటర్లు, జిమ్‌లను తెరిచేందుకు అనుమతి.
నాలుగో దశ: జూన్ 21వ తేదీ నుంచి నైట్ క్లబ్బులు, ఉత్సవాలు, సమావేశాలు, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు సహా అన్ని రకాల ఆంక్షల ఎత్తివేత.

కాగా, కోవిడ్ వేరియంట్ల వ్యాప్తిని నివారించేందుకు యూకే ప్రభుత్వం గతవారం కఠినమైన ప్రయాణ ఆంక్షలను విధించింది.దీని ప్రకారం హైరిస్క్ రెడ్ లిస్ట్‌లో వున్న 33 దేశాలను గుర్తించిన ప్రభుత్వం ఆ దేశాల నుంచి వచ్చే యూకే, ఇంగ్లాండ్, ఐర్లాండ్‌లకు చెందిన ప్రయాణీకులపై కఠిన నిబంధనలు విధించింది.
వీటి ప్రకారం.ఇంగ్లండ్‌కు రావాలనుకునే వారు 10 రోజులపాటు ప్రభుత్వం నిర్దేశించిన హోటళ్లలో క్వారంటైన్‌లో గడిపేందుకు, రవాణా చార్జీలు, వైద్య పరీక్షలకు అవసరమైన 1,750 పౌండ్లను ముందుగా చెల్లించాలి.
ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి 10 ఏళ్ల జైలు శిక్షతోపాటు 10వేల పౌండ్ల వరకు జరిమానా ఉంటుంది.ఇక రెడ్ లిస్ట్‌లో లేని భారత్ వంటి దేశాలకు వెళ్లిన యూకే, ఐర్లాండ్, ఇంగ్లాండ్ వాసులు పది రోజుల పాటు తమ ఇళ్లలోనే క్వారంటైన్‌లో వుండాలి.
స్వదేశానికి చేరుకున్న 2వ, 8వ రోజున తప్పనిసరిగా కరోనా నిర్థారణా పరీక్షలు చేయించుకోవాలి.అదేవిధంగా, రెడ్ లిస్ట్‌లోని 33 దేశాలకు చెందిన యూకే నాన్ రెసిడెంట్లపై బ్రిటన్‌లో ప్రవేశించరాదనే నిబంధన అమల్లో వున్న విషయం తెలిసిందే.
ఈ 33 దేశాల్లో వివిధ కరోనా వేరియంట్లు వ్యాప్తిలో ఉండటం గమనార్హం.