నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని వరుసగా రెండోరోజు ఈడీ అధికారులు విచారించారు.వారం వ్యవధిలో మూడోసారి ఆమెను దర్యాప్తు సంస్థ అధికారులు ప్రశ్నించారు.
సోనియాకు అనారోగ్య సమస్యలుండటంతో కార్యాలయానికి ఆమెకు తోడుగా కూతురు ప్రియాంక కూడా వెళ్లారు.కాగా, ఈ రోజుతో ఆమె విచారణ ముగిసినట్టేనని తెలుస్తోంది.
ఇప్పటికే సోనియాను రెండు రోజులు ఈడీ విచారించింది.రెండు రౌండ్లలో ఈడీ ఆమెకు 70 ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది.
సోనియా కొన్నింటికి సమాధానమిస్తూ, మరికొన్ని ప్రశ్నలకు తనకు తెలియదని బదులిస్తున్నట్టు తెలుస్తోంది.ఇక ఈ రోజు మరో 30 నుంచి 40 ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది…ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీస్ కు చేరుకున్న సోనియాను మూడు గంటలపాటు విచారించారు.
ఈడీ అదనపు డైరెక్టర్ మోనికాశర్మ నేతృత్వంలోని బృందం సోనియాను విచారించింది.
ఈడీ విచారణ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేపడుతున్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని గంటల పాటు ప్రశ్నించినందున సోనియాను విచారించాల్సిన అవసరం ఏముందని ఆ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ విమర్శించారు.ఆనారోగ్యంతో ఉన్న ఆమెకు పదేపదే సమన్లు ఇవ్వడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
కాగా, ‘సత్యాగ్రహ’ పేరిట చేస్తోన్న ఈ నిరసనలను బీజేపీ తిప్పికొట్టింది.

మరోవైపు కాంగ్రెస్ లో గ్రూప్ ఆఫ్ 23 గా పేరున్న ఆజాద్ , ఆనంద్ శర్మలాంటి నేతలు సోనియాకు అనుకూలంగా మాట్లాడటం ఊహించని పరిణామం.ఆ పార్టీలో నాయకత్వ మార్పును కోరిన ఈ నేతలిద్దరూ సోనియాను ఈడీ విచారించడాన్ని తప్పు పడుతున్నారు.తాను అనారోగ్యంతో ఉన్నందునే కాంగ్రెస్ చేపట్టిన నిరసనల్లో పాల్గొనలేకపోయానని ఆజాద్ వివరణ కూడా ఇచ్చారు.
కాగా, తాజా విచారణ అనంతరం సోనియాకు ఈడీ అధికారులు మరోసారి రావాలని నోటీసులేవీ ఇవ్వకపోవడం గమనార్హం.