ఇప్పటి వరకు మత రాజకీయాలకే ప్రాధాన్యం అన్నట్లుగా వ్యవహరించిన బిజెపి ఇప్పుడు కుల రాజకీయాల పైనా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.కాస్త ఆలస్యంగా అయినా ఏపీలో బలపడాలంటే ఏం చేయాలనే విషయాన్ని ఆ పార్టీ గుర్తించింది.
దీనికి తోడు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఏపీలో బలహీనం అవుతున్న తీరు, ఆ పార్టీ నాయకులు ఒకరి తరువాత మరొకరు ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోతూ ఉండటం, రాజకీయ భవిష్యత్తుపై వారిలో బెంగ పెరిగిపోవడం, చంద్రబాబు వయస్సు పైబడటంతో ఎక్కువగా హైదరాబాదులోని తన నివాసానికే పరిమితమైపోవడం ఇవన్నీ లెక్కలు వేసుకుంటున్నారు.బిజెపి 2024లో తమదే అధికారం అనే ధీమాలో ఉంది.
ఎలాగూ కేంద్ర అధికార పార్టీ తమదే కాబట్టి, అన్ని అనుకూలంగా ఉంటాయని, దీనికితోడు జనసేన పార్టీ అండదండలు పుష్కలంగా ఉండడంతో తిరుగులేని అధికారాన్ని దక్కించుకుంటాము అనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది.దీనిలో భాగంగానే ఏపీలో రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవాలనే ఆలోచనకు పదును పెట్టినట్టుగా కనిపిస్తోంది.
దీనికోసం కాపు సీఎం అనే ప్రచారం బిజెపి అకస్మాత్తుగా తెరపైకి తెచ్చింది.ప్రస్తుతం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బిజెపికి అండగా నిలబడుతున్నారు.ఇక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో, ఈ ఇద్దరిలో ఒకరిని సీఎంను చేసే అవకాశాన్ని పరిశీలనలోకి తీసుకుంటున్నారనే ప్రచారం మొదలైంది.
2024 లో ఇదంతా జరగాలంటే ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం అంతా బిజెపి వైపు నిలబడాలని, వారి మద్దతు పొందాలని బిజెపి గట్టిగానే ప్రయత్నిస్తోంది.ఈ మేరకు ఆ సామాజిక వర్గం లోని నాయకులందరినీ తమ వైపు తిప్పుకునేందుకు అప్పుడే మంతనాలు కూడా ప్రారంభించింది.వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వడం, పార్టీ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వడం, ఈ విషయమై అనేక హామీలు ఇవ్వడం వంటివి చేస్తూ కాస్త హడావుడి చేస్తోంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం బిజెపి, జనసేన కూటమి తరపున తానే సీఎం అభ్యర్థిని అని, తనకు తప్ప ఆ అర్హతలు ఎవరికీ లేవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.అందుకే బిజెపి పెద్దగా పవన్ పట్టించుకోనట్టుగా వ్యవహరించినా, పవన్ మాత్రం బిజెపి కి దూరం అవ్వకూడదు అనే నిర్ణయానికి వచ్చేసినట్టుగా వ్యవహరిస్తున్నారు.
బీజేపీ అండతోనే సీఎం అవ్వాలనే తన కోరికను నెరవేర్చుకోవాలనేది పవన్ కళ్యాణ్ అభిప్రాయంగా కనిపిస్తోంది.