టిడిపి ( TDP ) తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు స్టార్ క్యంపైనర్లు ఒక్కొక్కరుగా రంగంలోకి దిగుతున్నారు.ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబు ( Chandrababu )ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ, జనాల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు .
మండుటెండలను సైతం లెక్కచేయకుండా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు.మరోవైపు చూస్తే .టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ ( Nara Lokesh )మంగళగిరి నియోజకవర్గానికే పరిమితం అయ్యారు.ఇక్కడ గెలుపు ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న లోకేష్ పూర్తిగా మంగళగిరి పైనే ఫోకస్ చేశారు.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలకు ఆయన అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు.ఈ క్రమంలో హిందూపురం టిడిపి ఎమ్మెల్యే, చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ ఇప్పుడు టిడిపి తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
ఏప్రిల్ 12వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా బాలకృష్ణ బస్సు యాత్రను( Balakrishna bus trip ) మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.సైకిల్ రావాలి పేరుతో రాష్ట్రమంతటా బస్సు యాత్రను నిర్వహించనున్నారు.ఈ బస్సు యాత్ర ఏప్రిల్ 12న కదిరి ,పుట్టపర్తి, అనంతపురం నియోజకవర్గాల్లో జరగనుంది.ఏప్రిల్ 13న సింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల్లో , ఏప్రిల్ 14న బనగానపల్లె , ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో యాత్ర సాగనుంది.
ఏప్రిల్ 15న పాణ్యం, నందికొట్కూరు, కర్నూలు, ఏప్రిల్ 16న కోడుమూరు , ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో బాలకృష్ణ పర్యటించబోతున్నారు.ఈనెల 17న పత్తికొండ, ఆలూరు , రాయదుర్గ్ ప్రాంతాల్లో పర్యటిస్తారు.
ఇప్పటి వరకు నందమూరి బాలకృష్ణ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించలేదుl. అయితే బాలయ్య అభిమానుల కోసం ఆయన ఎక్కువగా రాయలసీమ జిల్లాలోనే పర్యటిస్తున్నారు.సీమలో బాలయ్యకు అభిమానులు ఎక్కువగా ఉండడంతో అక్కడ పార్టీలో జోష్ నింపేందుకు బాలయ్య ప్రయత్నిస్తున్నారు.దీనిలో భాగంగానే ముందుగా రాయలసీమ జిల్లాల్లో పర్యటించి ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు బాలయ్య ఏర్పాట్లు చేసుకుంటున్నారు.