1980వ దశకంలో సిక్కు వేర్పాటు వాదం మనదేశంలో రక్తపుటేరులు పారించిన సంగతి తెలిసిందే.పాకిస్తాన్( Pakistan ) మద్ధతుతో పంజాబ్‌కు చెందిన కొందరు సిక్కులు ప్రత్యేక ఖలిస్తాన్ దేశాన్ని కోరుతూ మారణహోమం సృష్టించారు.
ఈ పరిణామాలు.ఆపరేషన్ బ్లూస్టార్, ప్రధాని ఇందిరా గాంధీ హత్య, సిక్కుల ఊచకోత, పంజాబ్‌లో హింసాత్మక పరిస్థితుల వరకు దారి తీశాయి.
తదనంతర కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతంగా పనిచేయడంతో పంజాబ్‌లో శాంతి నెలకొంది.అయితే ఆయా దేశాల్లో స్థిరపడిన సిక్కుల్లో వున్న కొందరు ఖలిస్తానీ అనుకూలవాదులు నేటికీ ‘‘ఖలిస్తాన్’’ కోసం పోరాడుతూనే వున్నారు.
తాజాగా అమృత్‌పాల్ సింగ్( Amritpal Singh ) దూకుడుతో పంజాబ్ రగులుతోంది.ఇతని కోసం పోలీసులు ముమ్మరంగా వేట సాగిస్తున్నారు.దీంతో గడిచిన నాలుగు రోజులుగా పంజాబ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పంజాబీలు స్థిరపడిన ప్రాంతాల్లోనూ ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకుంటున్నాయి.చాలా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలను( Indian Embassies ) లక్ష్యంగా చేసుకున్న ఖలిస్తాన్ మద్ధతుదారులు రెచ్చిపోతున్నారు.

ఇదిలావుండగా.కొద్దినెలల క్రితం కెనడా, ఆస్ట్రేలియా( Canada, Australia )లలో ఖలిస్తాన్ మద్ధతుదారులు రెఫరెండం నిర్వహించారు.ఈ వ్యవహారం భారత్‌లో తీవ్ర కలకలం సృష్టించింది.దీనిపై సీరియస్ అయిన కేంద్రం.భారత వ్యతిరేక కార్యకలాపాలను నియంత్రించాల్సిందిగా ఆయా దేశాలను కోరింది.దీంతో ఆస్ట్రేలియా పోలీసులు రంగంలోకి దిగారు.
గత జనవరిలో మెల్‌బోర్న్ నగరంలో ఖలిస్తాన్ కోసం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిన ఆరుగురు వ్యక్తుల ఫోటోలను విక్టోరియా రాష్ట్ర పోలీసులు సోమవారం విడుదల చేశారు.

జనవరి 29న ఫెడరేషన్ స్వ్కేర్‌లో ఖలిస్తాన్ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది.ఈ సందర్భంగా ఖలిస్తాన్ మద్ధతుదారులు, భారత్ అనుకూలవాదులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది.నాటి ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటనలో కొందరు వ్యక్తులు భారత జాతీయ జెండాను సైతం దహనం చేశారు.అయితే ఈ నెల ప్రారంభంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా.
అక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాలపై ప్రధాని మోడీ అల్బనీస్‌తో చర్చలు జరిపారు.ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా పోలీసులు చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
