ఒకప్పటి ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ తాజాగా కన్నుమూశారు.మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ (46) తన నివాస ప్రాంతంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు.
శనివారం రాత్రి టౌన్స్‌విల్లేలో 10:30 గంటల ప్రాంతంలో జరిగిన కారు యాక్సిడెంట్‌లో సైమండ్స్ తీవ్రంగా గాయపడ్డారు.కారు ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
అప్పటికే వేగంగా వెళ్తున్న కారు బోల్తా పడి ఉంది.అందులో సైమండ్స్ ఒక్కరే ఉన్నారు.
ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఈ దిగ్గజ క్రికెటర్ ను పోలీసులు అంబులెన్స్‌లో హుటాహుటిన సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అయితే డాక్టర్లు సైమండ్స్ ప్రాణాలను కాపాడేందుకు చాలా ప్రయత్నించారు కానీ ఫలితం లేకుండా పోయింది.46 ఏళ్లకే సైమండ్స్ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయారు.దీంతో యావత్ క్రీడా లోకం శోకసంద్రంలో మునిగిపోయింది.
కొద్ది రోజుల క్రితమే షేన్ వార్న్ హఠాన్మరణం చెందారు.ఆ లోటును జీర్ణించుకోకముందే ఇప్పుడు సైమండ్స్ మరణించడంతో ఆస్ట్రేలియా క్రికెట్ ఫ్యాన్స్ మరింత విషాదంలో మునిగితేలుతున్నారు.

1998 నుంచి 2009 వరకు ఆసీస్ తరఫున 26 టెస్టులు, 198 వన్డేలు ఆడిన సైమండ్స్ 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.26 టెస్టుల్లో 1,462 స్కోరు చేయగా.198 వన్డేల్లో 5,088 పరుగుల చేశాడు.14 టీ20ల్లో 337 పరుగులు చేసి సత్తా చాటాడు.సైమండ్స్ టెస్టుల్లో 2 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు చేశాడు.వన్డేల్లో 6 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు చేసి అదరగొట్టాడు.జులపాల జుట్టు, తెల్లటి పెదాలతో కనిపించే సైమండ్స్ చాలా దూకుడుగా ఆడతాడు.

బంతులను ఉతకబాదుడు బాదిన సందర్భాలెన్నో.సైమండ్స్ ఆఫ్-స్పిన్, మీడియం పేస్ రెండింటినీ బౌలింగ్ చేస్తూ, విధ్వంసకర మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్‌తో అనేక మ్యాచ్ లను ఒంటి చేత్తో గెలిపించాడు.సైమండ్స్ ఒక టాప్-రేట్ ఫీల్డర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు.2003, 2007 50-ఓవర్ వరల్డ్ కప్‌లు గెలిచిన ఆస్ట్రేలియా టీమ్స్ లో కూడా కీలక పాత్ర పోషించాడు.







