రాష్ట్ర రాజకీయాల్లో స్పీకర్ పదవి రాజ్యాంగ బద్ధమైనది.స్పీకర్ అంటే రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సి ఉంటుంది.
స్పీకర్ ఏ పార్టీ తరఫున గెలిచినా అన్ని పార్టీలకు సమన్యాయం చేయాలి.అప్పుడే స్పీకర్ పదవికి హుందాతనం తెచ్చినవారు అవుతారు.
ప్రస్తుతం ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యలు వింటుంటే ఆయన స్పీకర్ అన్న విషయం మరిచిపోయి ఫక్తు రాజకీయ నేతగా మాట్లాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
గతంలోనూ స్పీకర్‌గా ఉన్నవాళ్లలో కొందరు రాజకీయంగా వ్యవహరించినా తమ్మినేని సీతారాం విషయానికి వస్తే ఆయన కొంచెం రాజకీయంగా శ్రుతి మించి మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కరెక్ట్‌గా చెప్పాలంటే మంత్రుల కంటే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రతిపక్ష టీడీపీపై ఎక్కువగా విమర్శలు చేయడం కనిపిస్తుండటం గమనార్హం.తాజాగా టీడీపీ మహానాడు జరుగుతున్న నేపథ్యంలో ఆయన మహానాడుపై శ్రుతి మంచి విమర్శలు చేశారు.
టీడీపీ చేసేది మహానాడు కాదు వల్లకాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.రాజకీయ పార్టీ అన్న తర్వాత రాజకీయ కార్యకలాపాల కోసం పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
దీనికి వైసీపీ కూడా అతీతమేమీ కాదు.కానీ ఒక పార్టీ కార్యక్రమాన్ని స్పీకర్ ఇలా అవహేళన చేయడం సరికాదని పలువురు సూచిస్తున్నారు.

అందులోనూ సదరు రాజకీయ పార్టీలో కీలక పాత్ర పోషించిన తమ్మినేని సీతారాం ఇలా మాట్లాడటాన్ని రాజకీయ పండితులు తప్పుపడుతున్నారు.
తమ్మినేని సీతారాం రాజకీయం పుట్టిందే టీడీపీలో అని పలువురు గుర్తుచేస్తున్నారు.ఆయన టీడీపీలోనే పలుమార్లు ఎమ్మెల్యే అయ్యారని.మంత్రి పదవులు కూడా చేపట్టారని గత చరిత్రను తవ్వుతున్నారు.తమ్మినేని సీతారాం టీడీపీలో ఉన్న సమయంలో ఎన్నో మహానాడులను చూశారని… మరి ఈరోజు మహానాడు కార్యక్రమం వల్లకాడుగా కనిపించడమేంటని పలువురు సూటిగా ప్రశ్నిస్తున్నారు.మహానాడుని వల్లకాడు అంటూ మాట్లాడి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా తమ్మినేని వ్యవహరించారని టీడీపీ నేత కూన రవికుమార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
మరోవైపు తమ్మినేని రాజకీయ ప్రసంగాలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు.







