ఏపీలో విఏసీపీ ప్రభుత్వం వర్సెస్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అన్నట్టుగా పరిస్థితి ఉంది.ఒకరిపై మరొకరు ఆధిపత్యం చెలాయించేందుకు అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ రెండు వ్యవస్థల మధ్య వివాదం చెలరేగుతోంది.మార్చిలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉన్నా, అప్పుడు కరోనా కారణాన్ని చూపించి అకస్మాత్తుగా ఎన్నికలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదా వేయించడం పెద్ద వివాదానికి కారణం అయ్యింది.
ఇక అప్పటి నుంచి వైసీపీ , నిమ్మగడ్డ మధ్య పెద్ద వివాదమే చెలరేగుతోంది.ఇది ఇలా ఉంటే ఈ మార్చితో నిమ్మగడ్డ పదవి కాలం పూర్తి కాబోతున్న నేపథ్యంలో, ఆ తరువాత మాత్రమే ఎన్నికలకు వెళ్ళాలి అనే అభిప్రాయంలో ప్రభుత్వం ఉండగా, ఆ సమయం నాటికి ఎన్నికల తంతు మొత్తం పూర్తి చేయాలనే ఆలోచనతో నిమ్మగడ్డ ఉన్నారు.

ఇది ఇలా ఉంటే ఈ ఎన్నికలను ఏదో రకంగా వాయిదా వేయించేందుకు చూస్తున్న వైసీపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రతిపాదనను తెరమీదకు తెచ్చినట్టు తెలుస్తోంది.ఆ తంతు పూర్తి అయిన తరువాత మాత్రమే ఎన్నికలకు వెళ్ళాలి అనే ఆలోచనతో ప్రభుత్వం ఉండగా, ప్రభుత్వానికి నిమ్మగడ్డ రాసిన ఒక లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది.కొత్తగా ఏపీలో 32 జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి తానేటి వనిత ప్రకటించడం, దానిపై జగన్ సమీక్ష చేయడం , జనవరి లో కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉండటం వంటి వ్యవహారాలు ఎన్నో చక చక జరిగిపోతున్నాయి.
అయితే వీటన్నింటిపైనా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అభ్యంతరాలు తెలుపుతూ ప్రభుత్వానికి లేఖ రాసినట్లుగా కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది.
ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ సమయంలో ఉంది, దాని మధ్యలో వాయిదా వేయడానికి సాధ్యమయ్యే అవకాశం కనిపించడం లేదు.ఈ ప్రయత్నాల్లో నిమ్మగడ్డదే పై చేయి అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తుండడంతో, జగన్ నిర్ణయం అమలు అయ్యేలా కనిపించడం లేదు.
నిమ్మగడ్డ నిర్ణయం అమలు కాకూడదు అనుకుంటే ఆయన పదవీ కాలం పూర్తి అయ్యేంతవరకు జిల్లాల విభజన సైతం ప్రభుత్వం వాయిదా వేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.







