అంతా అనుకున్నట్టుగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పాటు తమ అధినేత జగన్ సీఎం కుర్చీలో కూర్చున్నాడు.ఇక మనకు తిరుగే లేదు అంటూ భావించిన చోట మోట నాయకులకు, కార్యకర్తలకు కూడా ఇప్పుడు జగన్ తీరు అస్సలు నచ్చడంలేదట.
తమ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో తమ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందని ఇలా అయితే ఇక తాము అధికార పార్టీలో ఉన్నా ప్రయోజనం ఏంటీ అంటూ తెగ బాధపడిపోతున్నారట.ఇంతకీ వైసీపీ లో కింది స్థాయి నుంచి పై స్థాయి నాయకుల వరకు ఇలా ఫీల్ అవ్వడానికి కారణం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలేనట.
ఏపీ సీఎం జగన్ ఇప్పుడిప్పుడే పూర్తిస్థాయిలో పరిపాలనపై దృష్టి పెడుతున్నారు.పరిపాలనకు అనుగుణంగా ఎక్కడికక్కడ అధికారులను మార్చేశారు.
ప్రభుత్వ పథకాలు సామాన్య ప్రజలకు కూడా వారి ఇంటివద్దే లభించేలా చర్యలు తీసుకున్నాడు.ఒక రకంగా జగన్ తీసుకుంటున్న ఈ డేరింగ్ స్టెప్స్ ప్రజల్లో కూడా మంచి స్పందనే రాబట్టింది.

వైసీపీ ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చేందుకు అనేక వాగ్దానాలు ఇచ్చింది.వాటిలో కొన్నిటిని చూస్తే అసలు అమలు చేయడం సాధ్యమయ్యే పనే కాదు అని అందరికి అనిపించింది.అయితే జగన్ మాత్రం వాటిని అమల్లోకి తెచ్చి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నాడు.మరోవైపు ఏపీలో నిధుల కొరత వెంటాడుతోంది.ఏ పనిచేద్దామన్నా ఖాళీ ఖజానా కనిపిస్తోంది.అందుకే ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి వైఎస్ జగన్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదే సందర్భంలో అవినీతికి చోటు లేదని అన్ని కార్యక్రమాల్లో చెబుతున్నారు.దీంతో పాటుగా మద్యం షాపులను దశలవారీగా తొలగిస్తున్నారు.
వాటిని ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడపేందుకు చర్యలు తీసుకున్నారు.ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు అసలు చిక్కంతా కార్యకర్తలు, నాయకుల నుంచే ఎదురవుతోంది.
మరోవైపు నామినేషన్ పద్ధతిలో ఇచ్చే కాంట్రాక్టుల్లో జగన్ రిజర్వేషన్ కల్పించారు.బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు యాభై శాతం నామినేషన్ పనులు ఇవ్వాలని ఏకంగా చట్టం తెచ్చారు.
ఇక వివిధ కులాల కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తానని చెప్పిన జగన్ ఇప్పటి వరకూ ఆ ప్రయత్నాన్ని ప్రారంభించ లేదు.దీంతో తమ ప్రభుత్వం వస్తే పనులన్నీ తమకే దక్కుతాయని ఆశించిన క్యాడర్ లో నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి.
కాంట్రాక్టులు, మద్యం షాపులు తమకు దక్కకపోతే ఇప్పటివరకు పార్టీ కోసం తాము పెట్టిన ఖర్చు ఎలా రాబట్టుకోవాలంటూ సూటిగా ఎమ్మెల్యేలను ప్రశ్నించే వరకూ వచ్చింది.ఇదే విషయమై చాలామంది ఎమ్యెల్యేలు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లారట.
మరో వైపు చూస్తే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గరకు వచ్చేస్తున్నందున దీనికి వీలైనంత తొందరగా పరిస్కారం వెతికి పార్టీ నాయకుల్లో ఉత్సాహం నింపాలని వారు కోరుతున్నారు.