భయం అంటే ఏంటో తెలియని వ్యక్తి గా రాజకీయాలు చేస్తూ వస్తున్న ఏపీ సీఎం జగన్ కు ఇప్పుడు కొన్ని విషయాలు మింగుడుపడడంలేదు.ఏపీలో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకు తీవ్రతరమవుతోంది.
ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని రకాల జాగ్రత్త చర్యలు ముందస్తుగా తీసుకుంటున్నా ఏదో ఒక మూలన ఈ వైరస్ ప్రభావం కనిపిస్తూనే ఉంది.ఇప్పటికే మార్చి 25వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధన అమలు చేస్తున్నారు.
అయినా కేసుల సంఖ్య కట్టడి కాకపోవడం తో పాటు మరో రెండు రోజుల్లో లాక్ డౌన్ ముగియనున్న నేపథ్యంలో మరి కొంతకాలం ఈ లాక్ డౌన్ నిబంధనను పొడిగించాలంటూ కేంద్రానికి వివిధ రాష్ట్రాల నుంచి సూచనలు ఆనుతున్నాయి.నిన్ననే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
అయితే ఈ సందర్భంగా మెజార్టీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరి కొంత కాలం పాటు ఈ నిబంధనలను పొడిగించాలంటూ కోరారు.

ఇక ఏపీ సీఎం జగన్ విషయానికొస్తే లాక్ డౌన్ ను పొడిగించవద్దు అన్నట్టుగానే ప్రధానికి తన బాధను చెప్పుకున్నారు.ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఇప్పటికే వైరస్ ప్రభావం ఉన్న ప్రాంతాలను గుర్తించామని వాటిని రెడ్ జోన్ గా ప్రకటించామని, ప్రతి జిల్లా కేంద్రంలోనూ కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేశామని, మాస్కులు, వైద్య పరికరాలు అన్ని అందుబాటులో ఉన్నాయని చెప్పారు.మరీ ముఖ్యంగా ఏపీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని, ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా ప్రజలు, రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికే ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్నారని ప్రభుత్వానికి మరి కొంతకాలం నిబంధనలు పొడిగిస్తే పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోతోంది అని ప్రధానికి జగన్ చెప్పారు.
వాస్తవంగానే జగన్ ఆవేదనను పరిగణలోకి తీసుకుంటే ఏపీ ఇప్పటికే అప్పుల్లో కూరుకు పోయింది.
జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం, కీలక నిర్ణయాలు తీసుకోవడంతో భారీగా ఖజానాపై భారం పడింది.
ఇక ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా మార్చి 25వ తేదీ నుంచి ఏపీ పూర్తిగా ఆదాయం కోల్పోవడంతో సంక్షేమ పథకాలు అమలు, ఉద్యోగుల జీతభత్యాలు, మిగతా ఖర్చుల విషయంలో జగన్ తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.అదీ కాకుండా మరో 15 రోజుల పాటు ఈ నిబంధనను పొడిగిస్తే ఏపీ కోలుకోలేని విధంగా ఆర్ధిక కష్టాల్లో పడిపోతుందని, ఆ ప్రభావం రానున్న రోజుల్లో కూడా బాగా పడటంతో పాటు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ప్రభుత్వంపై పెరిగిపోతుందనే భయంతో జగన్ ఉన్నట్లుగా కనిపిస్తోంది.
అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్ డౌన్ ను పొడిగించవద్దు అని జగన్ ఇంతగా ప్రధానిని కోరుతున్నటుగా అర్ధం అవుతోంది.