దేశవ్యాప్తంగా బీజేపీ జెండా రెపరెపలాడించేందుకు ఆ పార్టీ అగ్రనేతలు అమిత్ షా, మోదీ తీవ్రంగా కష్టపడుతున్నారు.ఒకవైపు ప్రధానమంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా మోదీ ప్రయత్నిస్తున్నారు.
ఉత్తరాదిలో బిజెపి మంచి పట్టే సాధించడంతో అగ్ర నాయకుల దృష్టంతా దక్షిణాది రాష్ట్రాల మీద పడింది.ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని బలోపేతం చేయాలని వారు కంకణం కట్టుకున్నారు.
తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి రోజు రోజుకి మెరుగు అవుతూ వస్తోంది.కానీ ఏపీలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు.
పార్టీలోకి ఎమ్మెల్యేలు, కీలక నాయకులు అదిగో వస్తున్నారు ఇదిగో వస్తున్నారు అంటూ హడావుడి చేయడం తప్పించి అది కార్యరూపం మాత్రం దాల్చడం లేదు.

బీజేపీకి సమర్థవంతమైన లీడర్ లు ఉన్నా, గ్రూపు రాజకీయాలతో పార్టీని ముందుకు తీసుకువెళ్లలేకపోతున్నారు.విపక్షాలపై విరుచుకు పడేందుకు ముందు వరుసలో ఉంటూ వస్తున్న ఏపీ బీజేపీ నాయకులు సొంత పార్టీని ముందుకు తీసుకు వెళ్లడంలో మాత్రం వెనకడుగు వేస్తున్నారు.మొన్న జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఒక్క సీటు కూడా బిజెపి దక్కించుకోలేకపోయింది.
అయినా వచ్చే ఎన్నికల నాటికి బాగా బలం పెంచుకుని మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని చూస్తోంది.కానీ ఆ దిశగా మాత్రం అడుగులు వేయలేకపోతోంది.క్షేత్రస్థాయిలో బీజేపీకి పట్టు లేదు.ముందుగా దానిమీద దృష్టి పెట్టకుండా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారానే పార్టీ బలపడుతుందనే భావనలో బీజేపీ ఉంది.

ఈ నేపథ్యంలోనే ఇతర పార్టీల నేతలను చేర్చుకునేందుకు ఏపీ బీజేపీ నాయకులు హడావుడి చేస్తున్నారు.అయినా పెద్దగా ఆ పార్టీలోకి ఎవరు వచ్చి చేరడం లేదు.దీనికి కారణం బిజెపిలో ఉన్న గ్రూపు రాజకీయాలే.టిడిపి ఎమ్మెల్యేలు, కీలక నాయకులు భారీగా వచ్చి చేరుతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పెద్దగానే హడావుడి చేశారు.
అయినా ఏ ఒక్కరు ఆ పార్టీలోకి వచ్చి చేరింది లేదు.దీనికి కారణం టిడిపి నుంచి బిజెపి లోకి వెళ్ళిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కారణమని కన్నా వర్గం అనుమానం వ్యక్తం చేస్తోంది.
ఆయనే టిడిపి నేతలు చేరకుండా అడ్డుపడుతున్నారని గుర్రుగా ఉంది.
కోస్తా, రాయలసీమ జిల్లాలకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు ప్రయత్నించగా సుజనా చౌదరి వారు బిజెపిలోకి రాకుండా వారిని వారించడంతో ఆగిపోయినట్టు తెలుస్తోంది.
అదేవిధంగా వల్లభనేని వంశీ, ప్రకాశం జిల్లాకు చెందిన కరణం బలరాం బీజేపీలో చేరేందుకు ముందుగా ప్రయత్నించారని, వారిని కూడా సుజనా అడ్డుకున్న టు కన్నా వర్గం అనుమానాలు వ్యక్తం చేస్తుంది.కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరేందుకు వేచి చూశారు.
కానీ ఇక్కడ ఉన్న గ్రూపు రాజకీయాలు కారణంగా ఆయన చేరిక ఆగిపోయింది.ఏపీ బీజేపీ నేతల తీరుతో విసిగిపోయిన ఆదినారాయణ రెడ్డి డైరెక్ట్ గా ఢిల్లీ వెళ్లి జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిపోయారు.

ప్రస్తుతం ఏపీలో మూడు వర్గాలు ఉన్నాయి.అందులో ఒకటి కన్నా లక్ష్మీనారాయణ వర్గం, మరొకటి టీడీపీ నుంచి బిజెపిలో చేరిన సుజనా చౌదరి, అలాగే మొదటి నుంచి బీజేపీలో ఉన్న మరో వర్గం.ఇలా మూడు వర్గాలు పార్టీపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తూ పార్టీ ఎదుగుదలకు అడ్డం పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.దీనిపై అధిష్టానం దృష్టి పెట్టి గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టకపోతే బిజెపి ఏపీలో బలపడడం చాలా కష్టం అనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తం అవుతోంది.