జార్జ్ ఫ్లాయిడ్ హత్య: జాత్యహంకారంపై భగ్గుమన్న ఇండో- అమెరికన్ వైద్యులు

తెల్లజాతి పోలీసుల చేతిలో జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడి మరణంతో అగ్రరాజ్యం అమెరికా అట్టుడుకుతోంది.

గత వారం రోజులుగా ‘‘ ఐ కాంట్ బ్రీత్ ’’ పేరిట తమకు న్యాయం చేయాలంటూ నల్లజాతీయులు అల్లర్లు, లూటీలు, విధ్వంసాలు, దాడులతో అమెరికా కల్లోలం సృష్టిస్తోంది.

నిరసనల తాకిడికి డొనాల్డ్ ట్రంప్ సైతం శ్వేత సౌధాన్ని వీడి బంకర్‌లో తలదాచుకున్నారు.అటు నల్లజాతీయుల ఆందోళనకు అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా మద్ధతు లభిస్తోంది.

తాజాగా అమెరికాలోని భారత సంతతి వైద్యులు కూడా నల్లజాతీయుల పోరాటానికి సంఘీభావం తెలిపారు.భారతీయ అమెరికన్ వైద్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న అతిపెద్ద సంస్థ అయిన అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజియేషన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (ఏఏపీఐ) మైనారిటీ వర్గాలపై జాతి వివక్ష, హింసను ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇది ప్రతి ఒక్కరికీ కష్టమైన, బాధ కలిగించే సమయమని ఏఏపీఐ అధ్యక్షుడు సురేశ్ రెడ్డి అన్నారు.డాక్టర్లుగా బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న తాము ప్రజల ఆరోగ్యాన్ని బాగుచేసేందుకు అంకితభావంతో ఉన్నామని స్పష్టం చేశారు.

Advertisement

కానీ చాలా మంది మాత్రం ఆరోగ్యాన్ని దెబ్బతీసే జాత్యంహకారాన్ని ప్రత్యక్షంగా ఎదుర్కోకుండా ఈ లక్ష్యాన్ని నేరవేర్చలేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ప్రత్యేకించి మైనారిటీ వర్గాల అనారోగ్యం, మరణానికి ఈ జాత్యహంకారం దారి తీస్తుందని సురేశ్ రెడ్డి అన్నారు.

మరోవైపు ఆందోళనలు అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారని మీడియా కథనాలు ప్రసారం చేయడంపై అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆందోళనకారులు శాంతియుతంగా ఉంటే చర్చిని ఎందుకు తగులబెట్టేవాళ్లని ప్రశ్నించారు.శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై భాష్పవాయువును ప్రయోగించలేదని, మీరు తప్పుగా చూపించారంటూ మండిపడ్డారు.

కాగా జార్జి మృతిపై ఆందోళనలు ఆపకపోతే సైన్యాన్ని రంగంలోకి దించుతానంటూ ట్రంప్ చేసిన హెచ్చరికలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.

వెంకటేష్ అనిల్ రావిపూడి తో మళ్ళీ రోటీన్ సినిమానే చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు