సూర్యాపేట జిల్లా: కన్నతల్లి అనారోగ్యంతో కన్నుమూస్తే ఏ బిడ్డలైనా కన్నీరుమున్నీరుగా విలపిస్తూ కడసారి వీడ్కోలు పలుకుతూ ఘనంగా అంత్యక్రియలు జరిపిస్తారు.కానీ,కన్నబిడ్డలు ఆ తల్లి శవాన్ని పక్కన పెట్టి ఆస్తి కోసం పంచాయితీ పెట్టి రెండు రోజులుగా దహన సంస్కారాలు నిర్వహించకుండా పెద్ద మనుషుల సమక్షంలో రచ్చకు దిగిన అమానవీయ సంఘటన సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే…నేరేడుచర్ల మండలం( Neredcherla mandal ) కందులవారిగూడెం గ్రామానికి చెందిన లక్ష్మమ్మ (80) బుధవారం రాత్రి అనారోగ్యంతో మరణించింది.
ఆమెకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఐదుగురు సంతానం.
చిన్న కుమారుడు గతంలోనే మరణించగా,లక్ష్మమ్మ గత కొన్నేళ్లుగా నేరేడుచర్లలోని చిన్న కుమార్తె వద్దే ఉంటుంది.కాలుజారి కిందపడి అనారోగ్యంతో తల్లి చనిపోయిన విషయం తెలుసుకుని ఇంటికి వచ్చిన కన్నబిడ్డలు ఆమెకు అంత్యక్రియలు చేయడం మానేసి,ఆమె దగ్గర ఉన్న 21 లక్షల రూపాయలు ఆస్తి,20 తులాల బంగారం పంచుకోవడంపై దృష్టి పెట్టారు.
పంపకాల విషయంలో తేడాలు రావడంతో గ్రామ పెద్దల వద్ద పంచాయతీ పెట్టారు.అయినా పంపకాల తంతు తేలకపోవడంతో రెండు రోజులుగా మృతదేహం ఇంట్లోనే ఉంచారు.
ఆస్తి కోసం కన్నతల్లి దహన సంస్కారాలు ఆలస్యం చేస్తున్న బిడ్డలపై గ్రామస్తులు,బంధువులు అసహ్యం వ్యక్తం చేశారు.విషయం పోలీసుల వరకూ పోవడంతో పోలీసులు, పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పరిష్కారం చేసుకున్నారు.
కుమారుడికి 15 లక్షలు,6 లక్షలు వైద్య ఖర్చులు,20 తులాల బంగారం ముగ్గురు కూతుళ్లు( Three daughters) తీసుకునేలా పంపకాలు జరిపాక ఎట్టకేలకు శుక్రవారం సాయంత్రం లక్ష్మమ్మ అంతక్రియలు నిర్వహించారు.ఈ దారుణాన్ని దగ్గరగా చూసినవారు రాను రాను మనుషుల్లో మానవత్వం మంటకలిసి పోతుందని అసహనం వ్యక్తం చేశారు.