డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌పై దాడి జరిగింది.ఈ దర్శకుడు తెరకెక్కించిన ‘లోఫర్’ చిత్రాన్ని పంపిణీ చేసి నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు ఈ దాడికి పాల్పడ్డట్లుగా తెలుస్తోంది.
‘లోఫర్’ సినిమాను తమతో మాయ మాటలు చెప్పి భారీ మొత్తంకు కొనేలా చేసి, తీరా నష్టాలు వస్తే తమను ఆదుకోవడం లేదు అంటూ డిస్ట్రిబ్యూటర్లు మొదట పూరి ఆఫీస్ ముందు నిరసనకు దిగారు.ఆ తర్వాత పూరితో మాట్లాడేందుకు ప్రయత్నించగా వారితో మాట్లాడేందుకు పూరి ఇష్టపడలేదు.
దాంతో ఆగ్రహించిన డిస్ట్రిబ్యూటర్లు పూరిపై దాడికి దిగినట్లుగా తెలుస్తోంది.
ఆ సమయంలో పూరి సన్నిహితులు మరియు బాడీ గార్డులు ఉండటంతో ఆయనకు స్వల్ప గాయాలు మాత్రమే అయినట్లుగా తెలుస్తోంది.
ఈ విషయమై దర్శకుడు పూరి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశాడు.కేసును స్వీకరించిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు.
సదరు డిస్ట్రిబ్యూటర్లపై దాడి కేసును నమోదు చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు.త్వరలోనే వారిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని పోలీస్ వర్గాల వారు అంటున్నారు.
ఈ దాడిని దర్శకుల సంఘంతో పాటు సినీ పరిశ్రమకు చెందిన అంతా కూడా తప్పు బడుతున్నారు.ఇలా సినిమా లాస్‌కు దర్శకుడిని బాధ్యుడిని చేయడం తగదు అని, ముందే ఈ విషయమై ఒప్పందం చేసుకున్న తర్వాత ఇలాంటి దాడి హర్షనీయం కాదు అని అంతా అంటున్నారు.
‘లోఫర్’ చిత్రాన్ని పూరి జగన్నాధ్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మించిన విషయం తెల్సిందే.మెగా హీరో వరుణ్ తేజ్ ఈసినిమాలో హీరోగా నటించాడు.