యువ హీరో నాని వరుసగా ‘భలే భలే మగాడివోయ్’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రాలతో సక్సెస్‌లను అందుకున్నాడు.తాజాగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని నటిస్తున్నాడు.
వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో ‘అష్టా చమ్మ’ చిత్రం వచ్చిన విషయం తెల్సిందే.ఆ సినిమా సక్సెస్‌ను సాధించింది.
మళ్లీ ఇన్నాళ్లకు వీరిద్దరు కలిసి సినిమా చేస్తున్నారు అనేగానే సినీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి రేకెత్తింది.ఇక ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో టైటిల్‌ను ప్రకటించారు.
‘జెంటిల్‌మన్’ టైటిల్‌తో నిన్న శ్రీరామ నవమి సందర్బంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
దాదాపు 30 సంవత్సరాల క్రితం తమిళ చిత్రం తెలుగులో ‘జెంటిల్‌మన్’గా డబ్బింగ్ అయిన విషయం తెల్సిందే.
ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.ఇప్పటికి కూడా ఆ సినిమాకు ఫ్యాన్స్ ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు.
అంతటి క్రేజ్ ఉన్న సినిమా టైటిల్‌ను నాని సినిమాకు పెట్టడం అంటే సాహసం చేయడం అన్నట్లే.‘జెంటిల్‌మన్’ టైటిల్ కాస్త బరువైన టైటిల్ అని చెప్పవచ్చు.
మరి ఆ బరువును నాని మరియు మోహనకృష్ణ ఇంద్రగంటిలు మోస్తారా లేక అంచనాలను అందుకోవడంలో విఫలం అవుతారా అనేది చూడాలి.అతి త్వరలోనే ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఆడియోను ఇదే నెలలో విడుదల చేసే అవకాశాలున్నాయి.







