బడ్జెట్ విషయం లో ఏపీ కి తీవ్ర అన్యాయం జరిగింది అని ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.ఏపీ కి అరకొర కేటాయింపులు , చెయ్యి విదిలించినట్టు తక్కువ శాతం నిధులు ఇవ్వడం బీజేపీ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందిలో పడేసింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి సామాన్యుడి వరకూ అందరూ ఈ విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.విభజన కారణంగా విడిపోయి నష్టపోయిన రాష్ట్రానికి లోటు బడ్జెట్ పూరిస్తాం అని మాట ఇచ్చిన మోడీ కూడా అది పట్టించుకోలేదు.
అయితే జనాల అసంతృప్తి నీ ఆగ్రహాన్నీ తమ మీదకి మళ్ళకుండా చూసుకోవడం కోసం ఆయన కొత్త డ్రామా ఆడుతున్నారు అనీ అదే పంథా లో కేంద్రం మీద జనాలతో పాటు గొంతు కలిపి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అని అనిపిస్తోంది.
తెదేపా ప్రభుత్వానికి ప్రజాగ్రహం తమపైకి మళ్ళకుండా చూసుకోవాలనే తాపత్రయమే తప్ప రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందనే బాధ కలగకపోవడం విస్మయం కలిగిస్తుంది.
ఈవిధంగా ఎందుకు ఆరోపించవలసి వస్తోందంటే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ మరుక్షణమే ప్రధాని నరేంద్ర మోడిని మెచ్చుకోవడం, రాష్ట్రానికి న్యాయం జరిగేవరకు కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉంటామని చెప్పడం వలననే.







