ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పాలి? తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చెప్పాలి.తెలుగు ప్రభుత్వాలకు ఉమ్మడి హైకోర్టు ఈ ప్రశ్న వేసింది.
మీరు చనిపోయిన రైతు కుటుంబాలకు పరిహారం ఇస్తే సరిపోదు.రైతుల మరణాల వెనుక ఉన్న కారణాలను ఎందుకు అనలైజ్ చేయడం లేదు? అని ప్రశ్నించింది.రైతుల ఆత్మహత్యలను ఆపడానికి ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఏమిటో తెలియచేయాలని హైకోర్టు రెండు ప్రభుత్వాలను ఆదేశించింది.జన చైతన్య వేదిక అనే సంస్థ రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఆరోపిస్తూ హై కోర్టులో పిటిషన్ వేసింది.
దీన్ని విచారణకు తీసుకున్న కోర్టు ఆత్మహత్యల నివారణకు తీసుకుంటున్న చర్యలు ఏమిటో తెలియ చేయాలని ఆదేశించింది.తదుపరి విచారణను అక్టోబర్ 13వ తేదీకి వాయిదా వేసింది.ఒక పత్రిక తీసిన లెక్కల ప్రకారం కెసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 1168 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తేల్చింది.ఈ ఆత్మహత్యలు ఇంకా కొనసాగే పరిస్థితి కనబడుతోంది.
ఈరోజు తెలంగాణా అసెంబ్లీలో కూడా రైతుల ఆత్మహత్యల మీద అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి.ఆత్మహత్యలకు బాధ్యత తీసుకోవడానికి తెలంగాణా ప్రభుత్వం సిద్ధంగా లేదు.
గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల విధానాల వల్లనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అడ్డంగా వాదిస్తున్నది.తెలంగాణా సర్కారు 16 నెలల పసిగుడ్డు అంటూ కతలు చెబుతోంది.
రాష్ట్రంలో కరెంటు కోతలు చేసామని గొప్పలు చెప్పుకుంటున్న సర్కారు ఆత్మహత్యలకు కారణాలు అనలైజ్ చేయకుండా గత ప్రభుత్వాల మీదకు నెడుతోంది.ఎపీలోను రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా తెలంగాణతో పోల్చితే చాలా తక్కువ.
రైతుల ఆత్మహత్యల విషయంలో రెండు ప్రభుత్వాలూ దోషులే.మరి హై కోర్టుకు ఏం సమాధానం చెబుతాయో చూడాలి.







