నోటుకు ఓటు కుంభకోణంలో మరో నిందితుడైన ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మల్యే సండ్ర వెంకట వీరయ్యను తెలంగాణ ఏసీబీ అధికారులు సోమవారం సాయంత్రం అరెస్టు చేశారు.దీంతో ఈ కుంభకోణంలో ఏసీబీ అధికారులు మరో అడుగు ముందుకు వేసినట్లయింది.
రేవంత్ అరెస్టయిన నెల రోజుల తరువాత హైకోర్టు ద్వారా బెయిల్ పొందిన విషయం తెలుసు.ఆయన బెయిల్ రద్దు చేయించాలని ఏసీబీ అధికారులు సుప్రీం కోర్టుకు వెళ్లినా ఫలితం లేకుండా పోయింది.
చివరకు సోమవారం ఎమ్మెల్యే సండ్రను సోమవారం ఏడు గంటలపాటు విచారించిన అధికారులు అది అయిపోగానే అరెస్టు చేశారు.సండ్ర విషయంలో ఇప్పటివరకు హైడ్రామా జరిగింది.
ఈ మొత్తం కుంభకోణానికి కీలక వ్యక్తి అయిన, అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అయిన వేం నరేందర్ రెడ్డికి, సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ అధికారులు ఒకేసారి నోటీసులు పంపారు.వేం నరేందర్ రెడ్డి ఏసీబీ కార్యాలయానికి వచ్చి ఇంటరాగేషన్‌లో సహకరించగా, సండ్ర మాత్రం చెప్పా పెట్టకుండా ఆంధ్రాకు పారిపోయి వైజాగ్‌లోని ఆస్పత్రిలో చేరి, అక్కడి నుంచి రాజమండ్రి వచ్చి అక్కడో ఆస్పత్రిలో చేరి ‘అనారోగ్య నాటకం’ ఆడాడు.ఆ తరువాత హైదరాబాదుకు వచ్చి ‘నా ఆరోగ్యం బాగుపడింది.విచారించుకోండి’ అని ఏసీబీ అధికారులకు లేఖ రాయడంతో వారు పిలిపించి విచారించారు.వారు అడిగిన ప్రశ్నలకు ఈయన ఏం సమాధానాలు చెప్పాడోగాని, విచారణ పూర్తయిన తరువాత అరెస్టు చేశారు.కోర్టులో హాజరుపరిచాక ఇంకా ప్రశ్నించాలి…కస్టడీకి ఇవ్వండని కోరుతారేమో….! సండ్ర అరెస్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు షాక్ అనే చెప్పొచ్చు.ఆయన తన అస్ర్తమైన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ముమ్మరం చేస్తారేమో….!
.






