తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఆంధ్రా నాయకులపై, ఉమ్మడి ఆంధ్ర పాలకులపై విరుచుకుపడ్డారు.వారిపై మాటల తూటాలు విసిరారు.
యాభై ఎనిమిదేళ్లపాటు పరిపాలించిన ఆంధ్రా పాలకులు తెలంగాణను సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు.తెలంగాణలోని అడవులను నాశనం చేశారని, దాంతోపాటు సంస్కృతిని, ఈ ప్రాంత వైభవాన్ని కనుమరుగు చేశారని అన్నారు.
తెలంగాణ ప్రత్యేకంగా రాష్ర్టంగా ఏర్పడటంతో దీన్ని ‘బంగారం’ గా మారుస్తామని, బంగారు యుగం ప్రారంభమైందని అన్నారు.పచ్చదనం ఒక్కటే వానలు కురవడానికి, కరువును పారదోలడానికి, వాతావరణం చక్కగా ఉండటానికి దోహదం చేస్తుందన్నారు.‘హరితహారం’తో వచ్చే మూడేళ్లలో కరువు కనబడకుండాపోతుందన్నారు.హరితహారం కార్యక్రమం నిజంగా గొప్పదే.
ఇందులో సందేహంలేదు.కాని దాన్ని శ్రద్ధగా అమలు చేయాలి కదా.ఇలాంటి కార్యక్రమాలే కాంగ్రెసు పాలనలోనూ, చంద్రబాబు హయాంలోనూ అమలు చేశారు.పాలకులు హడావిడి చేసినంతగా ఆ కార్యక్రమాల అమలు లేదు.
చెరువులు బాగుచేసి వానలు పడగానే ఫుల్లుగా నీటితో నిండేలా చూస్తామని ఊదరగొట్టారు.విపరీతంగా ప్రచారం చేశారు.
అంతకు ముందు ప్రభుత్వాలేవీ చెరువులను బాగుచేసే (పూడిక తీయడం వగైరా) పనిని ఒక ఉద్యమంలా చేయలేదు.మిషన్ కాకతీయ చాలా గొప్ప కార్యక్రమమని ప్రశంసలు లభించాయి.
కాని ఆచరణలో ఏమైంది? ఎన్ని చెరువులు బాగు చేశారు? చివరకు రైతులు లాభపడ్డారా? కాంట్రాక్టర్లు ప్రయోజనం పొందారా? హరితహారమూ అంతే.మొక్కులు నాటుతారు సరే…! అవి పెరిగి, పెద్దయి చెట్లు అయ్యేంతవరకూ సంరక్షిస్తారా? అంత చిత్తశుద్ధి నాయకులకు, అధికారులకు ఉందా? దీన్నో ఉద్యమంలా చేయగలరా?







