ఎవరినైనా బుట్టలో వేసుకోవాలంటే నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి అని పొగడాలి.ఆ పొగడ్తలకు వారు పొంగిపోతే అవసరమైన పనులు చేసుకోవచ్చు.
పురాణ కాలం నుంచి ఇది కొనసాగుతూనే ఉంది.పూర్వం రాజుల ఆస్థానాల్లో పొగడ్తల కోసమే కొందరిని నియమించేవారు.
వారికి రాజును పొగడటమే పని.రాజుపై మనసులో ఎలాంటి అభిప్రాయం ఉన్నా డబ్బులు ఇస్తున్నారు కాబట్టి స్తోత్రం చేయాల్సిందే.ఎదటివాడిని లొంగదీయాలంటే పొగడ్తకు మించిన సాధనం లేదు.బ్రిటిషువారు మన దేశాన్ని ఆక్రమించుకొని సంస్థానాధీశులను లొంగదీసుకున్నప్పుడు వారికి ‘సర్’ అని, ‘రాజబహదూర్’ అని, ‘రాజ ప్రముఖ్’అని …ఇలా ఏవేవో బిరుదులు ఇచ్చేవారు.
ఇక ప్రస్తుత విషయానికొస్తే ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్ యోంగ్ కిమ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని యమ పొగిడారు.మోదీ ఏడాది పూర్తి చేసిన సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపిన ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు ‘నరేంద్ర మోదీ వంటి నాయకులు ఈ ప్రపంచానికి అవసరం’ అని ప్రశంసిచారు.
పేదరికాన్ని నిర్మూలించడానికి మోదీ దూరదృష్టితో చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.ప్రపంచ బ్యాంకుకు భారత్‌తో చాలా అవసరం ఉంది.కాబట్టి పొగిడి బుట్టలో వేసుకోక తప్పదు.కుర్చీలో ఎవరుంటే వారిని పొగుడుతుంది బ్యాంకు.
దేశానికి అప్పులు ఇవ్వాలి.అప్పులు ఇచ్చాక తన విధానాలను అమలు చేయాల్సిందిగా షరతులు పెట్టాలి.
తద్వారా ప్రయివేటీకరణను ప్రోత్సహించాలి.దేశ వనరులను కొల్లగొట్టాలి.
ఇదే ప్రపంచ బ్యాంకు పని.అందుకే ఎవరినైనా ఆకాశానికి ఎత్తుతుంది.







