ఎవరు కలిస్తే ఎవరు విడిపోతారు? కేంద్రంలో భాజపా, టీఆర్‌ఎస్ దోస్తీ చేస్తే తెలంగాణలో కమలం పార్టీతో టీడీపీ తెగదెంపులు చేసుకుంటుందట…! ఈ చర్చ ఎందుకొచ్చిందంటే…రెండు రోజుల క్రితం తెలంగాణ సీఎం కూతురు, నిజామాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీ అయిన కవిత కేంద్రంలో తనకు మంత్రి పదవి ఇవ్వడంపై మాట్లాడారు.కేంద్ర కేబినెట్‌లో చేరాలని ప్రధాని మోదీ ఆహ్వానిస్తే ఆలోచిస్తామన్నారు.
ఆమె ఈ విషయం చెప్పడం ఇది మొదటిసారి కాదు.అంటే కవితకు పదవి ఇచ్చే ఆలోచన ఏదో ఉందని అర్థమవుతోంది.
తన కూతురిని కేంద్ర మంత్రిగా చూడాలని తండ్రిగా కేసీఆర్ కూడా తహతహలాడుతున్నారేమో…! దీనిపై తెలంగాణ టీడీపీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ ఒకవేళ టీఆర్‌ఎస్-భాజపా కనుక కలిస్తే తాము రాష్ర్టంలో భాజపాతో స్నేహం వదిలేస్తామని అన్నారు.టీడీపీతో భాజపా బంధం ఆంధ్రప్రదేశ్ వరకు కొనసాగుతుందని, ఇక్కడ మాత్రం ఉండదని చెప్పారు.
మరి దయాకర్‌రావు అధినేత చంద్రబాబుకు తెలిసే ఈ ప్రకటన చేశారా? ఆయన అనుమతితోనే భాజపాను హెచ్చరించారా? తెలియదు.కేసీఆర్ కుటుంబానికి పదవుల పిచ్చి బాగా ఉందని, కేంద్రంలో మంత్రి పదవి కోసం ప్లాన్ చేస్తున్నారని దయాకర్‌రావు విమర్శించారు.
ఏది ఏమైనా కవితకు మంత్రి పదవి రావచ్చనే ఊహాగానాలు చాలారోజులుగా వినవస్తున్నాయి.మొదట్లో కేంద్రంలో మేమెందుకు చేరతామని చెప్పిన కవిత ఇప్పుడు ఆలోచిస్తాం అంటున్నదంటే అవగాహన ఏదైనా కుదిరిందా?
.






