వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం వివిధ దేశాలలో స్థిరపడిన ప్రవాస భారతీయులు( NRI’s ) మాతృదేశానికి ఎంతో సేవ చేస్తున్నారు.దేశం క్లిష్ట పరిస్ధితుల్లో ఉన్నప్పుడల్లా మేం ఉన్నామంటూ చేయూతను అందిస్తున్నారు.
అయితే విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐల ఆస్తులు( NRI Properties ) ఇక్కడ అన్యాక్రాంతం అవుతున్నాయి.కొందరు బంధువులు, సన్నిహితులే ప్రవాస భారతీయుల ఆస్తులను కబ్జా చేస్తున్నారు.
ప్రభుత్వాలు, పోలీసులు ఎన్నో రక్షణ చర్యలు చేపడుతున్నప్పటికీ కోట్లాది రూపాయల ఆస్తులు కబ్జాలకు గురవుతున్నాయి.
ప్రవాస భారతీయుల ఆస్తుల ఆక్రమణ కేసులు పెరుగుతున్న విషయాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించారు పంజాబ్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు సత్నం సింగ్ సంధు.
( Punjab MP Satnam Singh Sandhu ) ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఎన్ఆర్ఐల ప్రయోజనాలను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం బలమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.ఇటీవలి కాలంలో ఎన్ఆర్ఐలకు చెందిన ఆస్తుల భూ ఆక్రమణ కేసులు వేగంగా పెరుగుతున్నాయని , ఇది సమాజంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తోందన్నారు.
ఫలితంగా ఎన్ఆర్ఐలు తమ ఆస్తులను విక్రయించాల్సి వస్తోందని .ఇది వారికి , మాతృభూమికి మధ్య ఉన్న ఏకైక అనుసంధానమని సత్నం సింగ్ పేర్కొన్నారు.

ఈ విషయం చాలా తీవ్రమైనదని సంధు స్పష్టం చేశారు.ఈ సమస్యకు సంబంధించి పెరుగుతున్న సమస్యలను పరిష్కరించగల బలమైన యంత్రాంగాన్ని నిర్మించాల్సిన సమయం ఆసన్నమైందని సత్నం సింగ్ చెప్పారు.ఎన్ఆర్ఐ సమాజానికి వారి మాతృభూమిలోని పూర్వీకుల ఆస్తి/ భూమిని ప్రభుత్వం రక్షిస్తుందన్న హామీ ఇవ్వడానికి విశ్వాసాన్ని పెంపొందించే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎంపీ అభిప్రాయపడ్డారు.

కేంద్ర విదేశాంగ శాఖ రికార్డుల ప్రకారం.గడిచిన మూడున్నర సంవత్సరాల్లో 18 రాష్ట్రాల నుంచి ఆస్తి వివాదాల గురించి ఎన్ఆర్ఐల నుంచి 140 ఫిర్యాదులు అందాయి.వీటిలో అత్యధికంగా తమిళనాడుకు చెందిన 22 ఫిర్యాదులు, ఉత్తరప్రదేశ్‌కు సంబంధించిన 18 ఫిర్యాదులు , ఢిల్లీకి సంబంధించిన 12 ఫిర్యాదులు అందినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.