ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, హత్రాస్ లోని( Hathras ) సేథ్ ఫూల్ చంద్ బాగ్లా పీజీ కాలేజీలో దారుణం వెలుగులోకి వచ్చింది.రాజ్నీష్ అనే ప్రొఫెసర్( Professor Rajnish ) విద్యార్థినులను లైంగికంగా వేధించాడని ఆరోపణలు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
జాగ్రఫీ డిపార్ట్మెంట్ హెడ్ గా పనిచేస్తున్న రాజ్నీష్.అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, ఆ చర్యలను వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.
ఈ ఆరోపణలు నిజమని తేలడంతో కాలేజీ యాజమాన్యం వెంటనే స్పందించింది.ప్రొఫెసర్ రాజ్నీష్‌ను సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపల్ డాక్టర్ మహావీర్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు.అంతేకాదు, పోలీసులు కూడా వెంటనే రంగంలోకి దిగి రాజ్నీష్ పై FIR నమోదు చేశారు.సర్కిల్ ఆఫీసర్ యోగేంద్ర కృష్ణ నారాయణ్ తెలిపిన వివరాల ప్రకారం, రాజ్నీష్ పై భారతీయ న్యాయ సంహిత ( BNS ) లోని కఠినమైన సెక్షన్ల కింద కేసులు పెట్టారు.
అవేంటంటే.సెక్షన్ 64 (2) – అత్యాచారం, సెక్షన్ 68 – అధికారి హోదాలో ఉండి లైంగిక సంబంధం పెట్టుకోవడం, సెక్షన్ 75 – మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, వారి గౌరవాన్ని కించపరచడం.
రాజ్నీష్ విద్యార్థినులను వేధిస్తున్నట్టుగా ఉన్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇది చూసిన నెటిజన్లు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.రాజ్నీష్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.మార్చి 13న కొందరు విద్యార్థినులు ధైర్యం చేసి పోలీసులకు, జాతీయ మహిళా కమిషన్‌కు ( NCW ) అనామకంగా ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది.
ఒక విద్యార్థిని NCWకి రాసిన లేఖలో రాజ్నీష్ అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించాడని, వీడియోలు తీసి వాటితో బెదిరించాడని తెలిపింది.ఇంతకుముందు కూడా కంప్లైంట్ చేసినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
“మోడీ ప్రభుత్వం ‘బేటీ బచావో బేటీ పడావో’ అంటోంది.కానీ ఇలాంటి వాళ్లు ఇంకా అమ్మాయిలకు అన్యాయం చేస్తూనే ఉన్నారు.ఈ మనిషి వల్ల నేను చాలా బాధపడుతున్నా.ఒక్కోసారి చనిపోవాలని కూడా అనిపిస్తుంది” అంటూ తన గోడు వెళ్లబోసుకుంది.తమకు న్యాయం చేయాలని, సమాజం ఏమనుకుంటుందో అని భయపడి చాలామంది అమ్మాయిలు బయటకు రాలేకపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అనామకంగా ఫిర్యాదు చేసిన విద్యార్థినులను గుర్తించే పనిలో ఉన్నారు.అయితే రాజ్నీష్ మాత్రం పరారీలో ఉన్నాడు.
గత 18 నెలలుగా రాజ్నీష్ పై ఇలాంటి ఆరోపణలు వస్తూనే ఉన్నాయని తెలుస్తోంది.ఈ ఘటనపై విచారణ జరిపేందుకు సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, తహసీల్దార్, జిల్లా విద్యాశాఖాధికారితో కూడిన నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు.
వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు అధికారులు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.