గుజరాత్ రాష్ట్రంలోని భావ్‌నగర్ జిల్లాలోని ఓజ్ ఇన్‌స్టిట్యూట్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.ట్యూషన్ క్లాసులో ఒక విద్యార్థిపై కత్తితో దాడి జరిగిన ఈ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.
ఈ దాడి సమీప సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దాడి గురైన విద్యార్థి పేరు కార్తీక్.అతను స్థానిక ట్యూషన్ క్లాసుకు వెళ్తున్నాడు.
నిందితుడు జగదీష్ రచడ్, తన కుమార్తెతో కార్తీక్ ఫోన్‌లో మాట్లాడుతున్నాడనే అనుమానంతో కోపంతో రగిలిపోయాడు.దీంతో అతను ట్యూషన్‌కు వచ్చి ఉపాధ్యాయుల వద్ద ఫిర్యాదు చేశాడు.

ఉపాధ్యాయులు పరిస్థితిని సమర్థవంతంగా చక్కదిద్దేందుకు కార్తీక్, అతని స్నేహితురాలు, ఆమె తండ్రిని ఒక గదిలో కౌన్సెలింగ్ కోసం పిలిపించారు.అయితే కౌన్సెలింగ్ జరుగుతున్న సమయంలో, జగదీష్ రచడ్ అకస్మాత్తుగా తన జేబులోంచి కత్తి తీసి కార్తీక్‌ను పదే పదే పొడిచాడు.కేవలం ఐదు సెకన్లలోనే ఆరుసార్లు కార్తీక్‌పై దాడి చేశాడు.ఇక ఈ దాడిలో కార్తీక్ తీవ్రంగా గాయపడ్డాడు.అతని తొడలు, వీపు ప్రాంతాల్లో లోతైన గాయాలు అయ్యాయి.వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని సమాచారం.ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది.

సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.నిందితుడిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ట్యూషన్ క్లాసుల్లో ఇలాంటి సంఘటనలు జరగడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పిల్లల భద్రత పట్ల తల్లిదండ్రులు, విద్యాసంస్థలు మరింత జాగ్రత్త వహించాలి అనే వాదనలు వినిపిస్తున్నాయి.







