నల్లగొండ జిల్లా:తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న క్రమంలో 2012- 14 సంవత్సరాల మధ్యలో వివిధ యూనివర్సిటీల్లో నియమకాల విషయంలో భారీగా అవినీతి అక్రమాలకు పాల్పడి నియామకాలు చేపట్టారని,నాణ్యమైన విద్య అందించాలంటే అక్రమ నియామకాలపై కఠినమైన చర్యలు తీసుకునేలా చొరవ చూపాలని తెలంగాణ విద్యావంతుల వేదిక నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు ఎమ్మెల్సీ, ఆచార్య కోదండరాంను కోరారు.శనివారం ఎమ్మెల్సీ కోదండరాం మహాత్మ గాంధీ యూనివర్సిటీకి వచ్చిన క్రమంలో ఆయనకు వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా పందుల సైదులు మాట్లాడుతూ తెలంగాణలోని మహాత్మా గాంధీ,తెలంగాణ,కాకతీయ, ఉస్మానియా,పాలమూరు, శాతవాహన యూనివర్సిటీలలో 2012-2014 మధ్యకాలంలో అసిస్టెంట్,అసోసియేట్ ప్రొఫెసర్ నియమకాలు జరిగాయని,ఈ నియామకాలన్నీ యూజీసీ మరియు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా జరిగాయని,
ఆరోపణలు, ఆందోళనలు వెల్లువెత్తిన క్రమంలో అనేక విచారణ కమిటీలు వేసి చాలావరకు నియామకాలు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని తేల్చి చెప్పాయన్నారు.నూతనంగా తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టర్మినేట్ చేయడం జరిగిందన్నారు.
తదనంతరం టర్మినేటైన ఆధ్యాపకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే మీద కొనసాగుతున్నారన్నారు.విసీలుగా వచ్చినవారు కోర్టులో పకడ్బందీగా కౌంటర్ వేయకుండా టర్మినేట్ అయిన వారికి వత్తాసు పలుకుతున్నారన్నారు.
అలాంటి వారికి దుర్మార్గంగా ప్రమోషన్లు కూడా ఇస్తున్నారన్నారు.తెలంగాణ రాష్ట్రం వస్తే యూనివర్సిటీలో బాగుపడతాయని కలలుగన్నామన్నారు.
కానీ,విశ్వవిద్యాలయాలు అవినీతి అక్రమాలకు కేరాఫ్ నిలయంగా మారిపోయాయన్నారు.ప్రత్యేకమైన చొరవ తీసుకొని అక్రమ నియామకాలపై శ్రద్ద చూపాలన్నారు.
యూనివర్సిటీలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయని ఉన్నత విద్యారంగంలో నాణ్యమైన విద్యను అందించే దిశగా నిర్ణయాలు తీసుకోవాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ కు విజ్ఞప్తి చేశారు.







