నల్లగొండ జిల్లా:గత వారం రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాను మంచు దుప్పటి కప్పేసినట్లుగా తెల్లవారు జామున మూడు గంటల నుండి ఉదయం 10 గంటల వరకు పల్లె,పట్నం అనే తేడా లేకుండా కురుస్తున్న పొగమంచుతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.ఇక జాతీయ రహదారులపై, గ్రామీణ రోడ్లపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు.
ఇదిలా ఉంటే శనివారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉదయం 10 గంటల వరకు హిమ తూఫాన్ కురిసింది.రహదారులన్నీ వర్షం వచ్చినట్లుగా మారిపోయాయి.
వ్యవసాయ కూలీలు ఇతర ప్రాంతాలకు ఆటోలలో వెళ్లేవారు, బావుల దగ్గరకు వెళ్ళే రైతులు,పొద్దున్నే జాగింగ్ వెళ్ళే వాకర్స్ ఈ మంచు వర్షం కారణంగా బయటికి రావాలంటే భయంతో వణికిపోతున్నారు.వాహనదారులు లైట్లు వేసుకొని నెమ్మదిగా ప్రయాణం చేస్తున్నారు.
మంచుతోపాటు చలి, తీవ్రత పెరగడంతో వృద్ధులు,చిన్న పిల్లలు శ్వాసకోస బాధితులు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.