కెనడా ప్రధాన మంత్రి (Prime Minister of Canada)పదవికి రాజీనామా చేసిన జస్టిన్ ట్రూడో (Justin Trudeau)మరో సంచలన ప్రకటన చేశారు.త్వరలో జరగనున్న కెనడా ఫెడరల్ ఎన్నికల్లో తాను పోటీ చేయనని తెలిపారు.
షెడ్యూల్ ప్రకారం కెనడాలో సాధారణ ఎన్నికలు అక్టోబర్‌లో జరగాల్సి ఉంది.కానీ అంతకంటే ముందే ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
బుధవారం ఒట్టావాలో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రూడో మాట్లాడుతూ.నా సొంత నిర్ణయం మేరకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు.
అమెరికా అధ్యక్షుడిగా( President of the United States) ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌ను(Donald Trump) ఎదుర్కోవడానికి ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించే లక్ష్యంతో ట్రూడో- కెనడాలోని ప్రావిన్సుల ప్రధానుల మధ్య జరిగిన సమావేశం తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.రాజకీయాల నుంచి తప్పుకున్నాక తన జీవితం ఎలా ఉంటుందనే దానిపై ట్రూడో (Trudeau) అనిశ్చితి వ్యక్తం చేశారు.ట్రూడో మొదటిసారిగా 2008లో క్యూబెక్‌లోని పాపినో రైడింగ్ (కెనడాలోని నియోజకవర్గాలను రైడింగ్ అని పిలుస్తారు) నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లోనూ హౌస్ ఆఫ్ కామన్స్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.2021లో ట్రూడో 50.3 శాతం ఓట్లను సాధించాడు.2015 నుంచి నేటి వరకు కెనడాను (Canada)ఆయన అప్రతిహతంగా పరిపాలిస్తున్నారు.
జనవరి 6న లిబరల్ పార్టీకి కొత్త నాయకుడు ఎన్నికైన తర్వాత ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు.ఈ ప్రక్రియ మార్చి 9న ముగుస్తుంది.ప్రధాని పదవిలో పోటీ పడే వారు జనవరి 23 వరకు పోటీదారులుగా చేరవచ్చు.
ప్రధాన పోటీదారులుగా కెనడియన్ మీడియా అభివర్ణిస్తున్న వారిలో బ్యాంక్ ఆఫ్ కెనడా గవర్నర్ మార్క్ కార్నీ, మాజీ ఉప ప్రధాన మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.గురువారం ఎడ్మాంటన్‌లో కార్నీ తన నిర్ణయాన్ని ప్రకటించవచ్చు.
అలాగే జనవరి 20 నాటికి ఫ్రీలాండ్ కూడా తన నిర్ణయాన్ని తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.