ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ రేసులో భారత సంతతికి చెందిన అభ్యర్ధులు నిలిచారు.ఈ పదవి కోసం పోటీపడుతున్న దాదాపు 38 మంది ఫైనలిస్టులను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ బుధవారం ప్రకటించింది.
వీరిలో భారత సంతతికి చెందిన అభ్యర్ధులు కూడా ఉన్నారు.అంకుర్ శివ్ భండారి, నిర్పాల్ సింగ్ భంగల్, ప్రతీక్ తర్వది తదితరులు ఈ పదవికి పోటీపడుతున్నారు.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్( Imran Khan) కూడా ఛాన్సలర్ పదవికి పోటీపడగా.తుది జాబితాలో ఆయనను అనర్హుడిగా ప్రకటించారు.
మాజీ కన్జర్వేటివ్ పార్టీ నేత లార్డ్ విలియం హేగ్, మాజీ లేబర్ పార్టీ నేత లార్డ్ పీటర్ మాండెల్సన్ ఎంపికైన రాజకీయ నాయకులలో ఉన్నారు.యూనివర్సిటీ నిబంధనలలో పేర్కొన్న విధంగా ఛాన్సలర్ ఎన్నికల కమిటీ దరఖాస్తులను పరిగణించిందని విశ్వవిద్యాలయం తన ప్రకటనలో తెలియజేసింది.
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సిబ్బంది, గ్రాడ్యుయేట్లతో కూడిన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ సభ్యులు కొత్త ఛాన్సలర్‌ను ఎన్నుకునేందుకు ఆన్లైన్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.ఇప్పటి వరకు ఛాన్సలర్‌గా ఉన్న హంకాంగ్ మాజీ గవర్నర్ లార్డ్ ప్యాటెన్ 2024 చివరిలో పదవీ విరమణ చేయనున్నారు.
కొత్త ఛాన్సలర్ ఎవరనేది నవంబర్ 25న అధికారికంగా ప్రకటించనున్నారు.ఈ ఏడాది ప్రారంభంలో రూపొందించిన సవరణలకు అనుగుణంగా కొత్త ఛాన్సలర్ పదేళ్లకు మించకుండా పదవిలో ఉంటారు.ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి ఛాన్సలర్ నామమాత్రపు అధిపతి.వర్సిటీ నిర్వహించే కీలక వేడుకలకు ఆయన అధ్యక్షత వహిస్తారు.అలాగే వైస్ ఛాన్సలర్‌ను ఎన్నుకునే కమిటీకి కూడా అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలకు వర్సిటీ తరపున రాయబారిగా వ్యవహరిస్తారు.
కాగా.ఆక్స్ఫర్డ్ యూనివర్సిటి( University of Oxford )కి 1000 ఏళ్ల చరిత్ర ఉంది.2022 నాటికి 6,945 మంది సిబ్బంది.2023 నాటికి 26,945 మంది విద్యార్ధులు ఇక్కడ విద్యను అభ్యసించినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.వీరిలో అండర్ గ్రాడ్యుయేట్లు 12,580 మంది.పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 13,445 మంది విద్యార్ధులు ఉన్నారు.ప్రపంచ ప్రఖ్యాత రాజకీయ వేత్తలు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, మేధావులు ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకున్నారు.