రాజన్న సిరిసిల్ల జిల్లాలో పొగాకు వాడకం నివారించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సంబంధిత అధికారులను ఆదేశించారు.బుధవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో పొగాకు వాడకం నివారణకు తీసుకోవాల్సిన చర్యల పై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.
పొగాకు నియంత్రణ కార్యక్రమానికి సంబంధించి వివిధ శాఖల వారు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వివరించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ,యువకులలో పొగాకు వాడకం నివారించేందుకు జాతీయ పొగాకు ఫ్రీ యూత్ క్యాంపెయిన్ 2.0 కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని, Say No To Tobacco, Yes to Life నినాదాన్ని బలంగా యువత లోకి తీసుకొని వెళ్ళాలని కలెక్టర్ తెలిపారు.సామాజిక మాధ్యమాలలో పొగాకు వాడకం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ఫోటోలు, వీడియో లు అప్ లోడ్ చేయాలని, టి.ఎస్.ఎస్ కళాకారుల ద్వారా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.
జిల్లాలోని ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల, కళాశాలలో పొగాకు వాడకం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు అవగాహన కల్పించాలని అన్నారు.పొగాకు ఉత్పత్తుల చట్టం ప్రకారం స్కూలు ,కాలేజీల ఆవరణ నుంచి 100 మీటర్ల వరకు ఉత్పత్తులను అమ్మ రాదని, 15 రోజుల వ్యవధిలో విద్యాసంస్థల 100 మీటర్ల పరిధిలో ఉన్న పాన్ డబ్బాలను మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు.
దసరా సెలవుల తర్వాత 15 రోజుల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థల్లో పొగాకు వాడకం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.జిల్లాలో ఉన్న విద్యా సంస్థల్లో విద్యార్థుల అలవాట్లను పరిశీలించాలని, పొగాకు వాడకం వల్ల వచ్చే నష్టాలను వివరించాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, మార్కెట్, సినిమా థియేటర్, పార్కు మొదలగు ప్రజా సంచారం అధికంగా ఉండే ప్రదేశాలలో పొగ త్రాగ రాదు అనే బోర్డులు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు.
పొగాకు వాడకం వల్ల కలిగే నష్టాలను వివరించేందుకు అవసరమైన ఐఈసీ మెటీరియల్ సిద్ధం చేయాలని అన్నారు.
స్వచ్ఛంద సంస్థలు మహిళలు యువతను రైతులను భాగస్వామ్యం చేస్తూ గ్రామాలలో గ్రామ సభ నిర్వహించి పొగాకు వాడకం వల్ల కలిగే నష్టాలను వివరించాలని, పొగాకు ఫ్రీ గ్రామాల రూపకల్పన లక్ష్యంగా టి ఎస్ ఎస్ కళాకారుల ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తూ కార్యచరణ సాగాలని అన్నారు.
పొగాకు ఉత్పత్తుల చట్టం 2003 సెక్షన్ 4 ప్రకారం బహిరంగ ప్రదేశాలలో,కార్యాలయాలలో పొగాకు త్రాగడం నేరమని, సెక్షన్ 5 ప్రకారం పొగాకు ఉత్పత్తుల ప్రకటనలు నిషేధించాలని, కిరాణా షాపుల వద్ద ఎక్కడా సిగరెట్ ప్యాకెట్ల ప్రచారం నిర్వహించడానికి వీల్లేదని, సెక్షన్ 6 ప్రకారం 18 సంవత్సరాల కంటే చిన్న పిల్లలకు అమ్మడం నేరమని, ఈ చట్టాలు పకడ్బందీగా అమలయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం.వసంత్ రావు, డి.పి.ఆర్.ఓ., వి.శ్రీధర్ , డి.ఐ .ఓ.మోహన్, లేబర్ ఆఫీసర్, నజీర్ అహ్మద్, ఫుడ్ సేఫ్టీ అధికారి ఎన్.అనూష, డ్రగ్ ఇన్స్పెక్టర్ భవాని, సేల్స్ టాక్స్ అధికారి శైలజ, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కే.విజయ రఘునందన్, మానేర్ ఎన్.జి.ఓ.మెంబర్ సి.హెచ్.భాస్కర్, కమర్షియల్ ట్యాక్స్, కార్మికశాఖ, విద్యాశాఖ,పోలీస్ శాఖ, సంబంధిత శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.