రాజన్న సిరిసిల్ల జిల్లా: జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఈ రోజు 17వ పోలీస్ బెటాలియన్ సర్దాపూర్ నందు బెటాలియన్ కమాండెంట్ యస్.శ్రీనివాస రావు మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి మహాత్మునికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కమాండెంట్ యస్.శ్రీనివాస రావు మాట్లాడుతూ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ”గారు 1869 అక్టోబరు 2 వ తేదీన గుజరాతు లోని పొర్లు బంధర్లో జన్మించారు.13 ఏళ్ల వయస్సులో కస్తూరిబాయితో వివాహము జరిగింది.19ఏళ్ల వయస్సులో న్యాయశాస్త్ర విద్యాభ్యాసానికి ఇంగ్లాండ్ వెళ్ళారు.1891లో అతను పట్టభద్రుడై భారతదేశానికి తిరిగివచ్చాడు.బొంబాయి లోను , రాజ్‌కోట్ లోను అతను చేపట్టిన న్యాయవాద వృత్తి అంతగా రాణించలేదు.1893లో దక్షిణాఫ్రికా లోని నాటల్‌లో ఒక న్యాయవాద (లా) కంపెనీలో సంవత్సరము కాంట్రాక్టు లభించింది.ఒక సంవత్సరము పనిమీద వెళ్ళిన గాంధీ, దక్షిణాఫ్రికాలో 21 సంవత్సరాలు (1893 నుండి 1914 వరకు) గడిపాడు.
కేవలం తెల్లవాడు కానందువల్ల రైలు బండి మొదటి తరగతి లోంచి నెట్టివేయడం, హోటళ్ళలోకి రానివ్వకపోవడం వంటి జాతి వివక్షతలు అతనికి సమాజంలోని అన్యాయాలను కళ్ళకు కట్టినట్లు చూపాయి.వాటిని ఎదుర్కోవలసిన బాధ్యతను గ్రహించి, వాటిని ఎదురుకొన్నాడు.1914లో గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చి భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు.ప్రజలు అతన్ని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు.
సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు.సహాయ నిరాకరణ, సత్యాగ్రహము అతని ఆయుధాలు.కొల్లాయి కట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటాడు.20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితం చేసిన రాజకీయ నాయకునిగా ప్రజలు గుర్తించారు అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ లు సాంబ శివరావు, ఉదయభాస్కర్, రామదాసు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రమీల,అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.