రాజన్న సిరిసిల్ల జిల్లా: ఫ్యామిలీ డిజిటల్ కార్డు కోసం వివరాలు పక్కాగా సేకరించాలని ఆయా జిల్లా కలెక్టర్లను రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.ఫ్యామిలీ డిజిటల్ కార్డు, ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులు, రెండు పడక గదులు, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు అంశాలపై ఆయా జిల్లాల కలెక్టర్లతో మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం నిర్వహించగా, జిల్లా నుంచి అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ హాజరయ్యారు.
అనంతరం మంత్రి మాట్లాడారు.ఈ నెల 3వ తేదీ నుంచి ఫ్యామిలీ డిజిటల్ కార్డు కోసం పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోని ఒక మున్సిపల్, గ్రామంలో కుటుంబాల వివరాలు ఇంటింటికీ తిరిగి సేకరించాలని, దీనికి నోడల్ ఆఫీసర్ ను నియమించాలని సూచించారు.
సర్వే సందర్భంగా ఆయా కుటుంబాల్లో పుట్టిన, మరణించిన వారి వివరాలు తీసుకొని ఎంట్రీ చేయాలని ఆదేశించారు.
ఈ నెల 8 వ తేదీ వరకు ఇది పూర్తి చేయాలని, 9 వ తేదీ స్క్రూటినీ ఉంటుందని, 10 వ తేదీన రిపోర్ట్ సబ్మిషన్ ఉంటుందని తెలిపారు.
ఈ పైలట్ ప్రాజెక్టు ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా మిగితా సర్వే పనులపై ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.అనంతరం ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులు ఏ ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయి? ఎన్ని పూర్తి చేశారో అడిగి తెలుసుకున్నారు.ఆయా దరఖాస్తులు నిబంధనల ప్రకారం పరిష్కరించాలని ఆదేశించారు.రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని రెండు పడక గదులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయో వివరాలు తెలుసుకున్నారు.
ఇంకా ఏమైనా పనులు చేయాల్సి ఉంటే వెంటనే పూర్తి చేసి, త్వరలో పంపిణీ చేసేందుకు సిద్ధం చేయాలని సూచించారు.కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
సన్న వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 అదనంగా అందజేయనుందని తెలిపారు.సన్న, దొడ్డు వడ్ల సేకరణకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.సన్న వడ్ల లో దొడ్డు వడ్లు కలవకుండా చూసుకోవాలని, వ్యవసాయ అధికారి పరిశీలించిన తర్వాత వాటిని పంపాలని పేర్కొన్నారు.
రైతులకు ఏ ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి, సీఎస్ ఆదేశించారు.ఈ సమావేశం లో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు రమేష్, రాజేశ్వర్, డీఆర్డిఓ శేషాద్రి, మున్సిపల్ కమిషనర్లు మీర్జా ఫసహత్ అలీ బేగ్, సంపత్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి వసంత లక్ష్మి, డీటీసీపీఓ అన్సార్ తదితరులు పాల్గొన్నారు.








