యాదాద్రి భువనగిరి జిల్లా: ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలని,సిపిఎం యాదాద్రి జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం ముషీపట్ల గ్రామంలో నేర్లకంటి సత్తయ్య అధ్యక్షన జరిగిన గ్రామశాఖ మహాసభలో ఆయన మాట్లాడుతూ రైతు భరోసా ఎకరానికి రూ.15వేలు,ఆసరా పింఛన్లు రూ.4 వేలు, మహిళలకు నెలకు రూ.2500,ఇండ్లు,రేషన్ కార్డులు లాంటి అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైనదని విమర్శించ్చారు.
ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేసి,ప్రజల విశ్వాసాన్ని పొందాలని హితవు పలికారు.
అనంతరం ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న ముషీపట్ల ఊరచెర్వు కట్ట వెడల్పు చేసి,మరమ్మత్తులు చెయ్యాలని, ఎస్సీకాలనీలో సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాలు నిర్మించాలని,నూతన గ్రామపంచాయితీ భవన నిర్మాణంతో పాటు, ముషీపట్ల-బుజిలాపురం, ముషీపట్ల-కల్మకుంట- అనాజిపురం,పనకబండ- ముషీపట్ల వరకు బిటి రోడ్లువేసి,గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామ మహాసభలో తీర్మానించారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం సీనియర్ నాయకులు పైళ్ల యాదిరెడ్డి,సిపిఎం మోత్కూరు మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు,పైళ్ల రాంరెడ్డి, పాటి శ్రీనివాసరెడ్డి, నార్లకంటి సత్తయ్య, భువనగిరి యాదయ్య, మామిడి సైదులు తదితరులు పాల్గొన్నారు.