ఏపీలో టిడిపి( TDP ) కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ముఖ్యమంత్రిగా టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) బాధ్యతలు స్వీకరించినా, ఆయనలో అంత ఉత్సాహం అయితే కనిపించడం లేదు.గత వైసిపి ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలు భ్రష్టుపడ్డాయని, ఏపీ ఆర్థికంగా దివాలా తీసింది అని, ఇప్పుడున్న పరస్థితుల్లో ప్రభుత్వాన్ని సజావుగా నడిపించేందుకు అవసరమైన నిధుల కొరత తీవ్రంగా ఉందని, వాటిని అధిగమించి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంతో పాటు ,ఏపీని అభివృద్ధి బాటలు పట్టించడం అంత ఆషామాషీ కాదు అనే విషయం చంద్రబాబుకు అర్థం అయింది.
అందుకే ఆచితూచి వ్యవహరిస్తున్నారు.పొదుపుగా ఉండాలంటూ అందరికీ పదేపదే చెబుతున్నారు.
ఒకటో తేదీనే పెన్షన్లతో పాటు, ఉద్యోగాలకు జీతాలు సక్రమంగా చెల్లించాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది .దీంతో ప్రతి నెల అప్పు కోసం వెతుక్కోవలసిన పరిస్థితి.

ఏపీ ఆర్థిక స్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడం , గతంలో మాదిరిగా ఇప్పుడు ఏపీ ( Ap )పరిస్థితి లేకపోవడంతో అనవసర ఖర్చులు తగ్గించుకుంటేనే కొంతవరకైనా బయటపడవచ్చు అని చంద్రబాబు భావిస్తున్నారు.ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఈ మేరకు ఏపీలో ప్రభుత్వ సలహాదారుల భర్తీకి చంద్రబాబు ఏమాత్రం ఇష్టపడడం లేదు.2014 నుంచి 19 వరకు టిడిపి ప్రభుత్వంలో అనేకమంది సలహాదారులు ఉన్నారు.వివిధ శాఖలకు సంబంధించి సలహాదారులను నియమించుకున్నారు .ఆ తరువాత అధికారం చేపట్టిన వైసిపి విచ్చలవిడిగా సలహాదారుల నియామకం చేపట్టింది.అవసరం ఉన్నా, లేకపోయినా ప్రభుత్వ సలహాదారులంటూ దాదాపు 40 మంది వరకు ఉండేవారు.వీరికి నెలకు లక్షల్లో వేతనంతో పాటు, వసతి , వాహన ,కార్యాలయం, తదితర సౌకర్యాలు కల్పించడం జరిగింది .

ఈ వ్యవహారాన్ని హైకోర్టు కూడా తప్పు పట్టింది.ఈ నేపథ్యంలో సలహాదారుల సేవలకు దూరంగా ఉండి ఆర్థిక భారం నుంచి తప్పించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు.సలహాదారులు పేరుకు మాత్రమే ఉంటారని, వారు ఇచ్చే సలహాలను పరిగణలోకి తీసుకునే పరిస్థితి ఉండదని బాబుకు బాగా తెలుసు. కేవలం రాజకీయ నిరుద్యోగాన్ని తగ్గించేందుకు, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ఏదో ఒక పదవి ఇవ్వాల్సి ఉండడంతోనే , ఇద్దరు ముగ్గురు సలహాదారుల నియామకాలు ఉంటాయని కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో సలహాదారులను నియమించుకుని ఏపీ ఖజానాపై భారం మోపి ఇబ్బందులు పడే కంటే ప్రభుత్వ సలహాదారుల నియామకానికి పులిస్టాప్ పెడితేనే మంచిదనే అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నారట.