నల్లగొండ జిల్లా:భూమి పట్టదారుడు లేకుండానే మరో వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేసిన ఘటన నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలంలో జరిగింది.బాధిత రైతు తహసీల్దార్ కార్యాలయం ముందు తన గోడు వెళ్లబోసుకోవడంతో వెలుగులోకి వచ్చింది.
ఈ సందర్భంగా బాధిత రైతు షేక్ గోరేమియా మీడియాతో మాట్లాడుతూ గుర్రంపోడు మండలం ఉట్లపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 223/3/1లో తనకు వారసత్వంగా వచ్చిన ఒక ఎకరం 15 గుంటల వ్యవసాయ భూమి ఉందని,తనకు తెలియకుండానే 2022 లో రెవిన్యూ అధికారులు షేక్ ఇమామ్ అనే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు.విషయం తెలుసుకుని విస్తుపోయిన తాను తన దగ్గరున్న అన్ని ఆధారాలతో రెవిన్యూ కార్యాలయానికి వెళ్లి తన భూమిని తనకు పట్టా చేయాలని గత రెండేళ్లుగా తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
అక్రమంగా ఇతరులకు తన భూమిని సులువుగా పట్టా చేసిన అధికారులు,అన్ని ఆధారాలు ఉన్న నా సొంత భూమిని నాకు పట్టా చేయమంటే మాత్రం పట్టించుకోవట్లేదని రైతు ఆరోపించాడు.తన భూమి తనకు పట్టా చేయని పక్షంలో ఇక నాకు చావే శరణ్యం అంటూ రైతు కన్నీరు పెట్టుకున్నాడు.
ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి బాధిత రైతు ఆరోపణలపై విచారణ జరిపి,సమస్యను తక్షణమే పరిష్కరించాలని రైతు వేదన చూసిన వారు కోరుతున్నారు.