నల్లగొండ జిల్లా: కన్నతండ్రిని కన్నకొడుకు రోకలి బండతో కొట్టి హతమార్చిన ఘటన నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం చేపూరు గ్రామంలో శుక్రవారం కలకలం రేపింది.ఎస్ఐ శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం… చేపూరు గ్రామానికి చెందిన ఐతగోని కొండయ్య (60) అదే గ్రామానికి చెందిన మహిళ (50)తో గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు.
కన్నతండ్రి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేని కొడుకు శంకర్ తండ్రిపై కోపంగా ఉండేవాడు.
గురువారం రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో సదరు మహిళ ఇంట్లో తండ్రి కొండయ్య ఉండడం చూసి మద్యం మత్తులో ఉన్న కొడుకు శంకర్ కోపోద్రిక్తుడై రోకలి బండతో తండ్రిని విచక్షణా రహితంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన కొండయ్యను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి,కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివప్రసాద్ తెలిపారు.