నల్లగొండ జిల్లా:మర్రిగూడ మండలంలో పలుచోట్ల ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు సరైన రక్షణ ఏర్పాట్లు చేయకుండా ఓపెన్ గా వదిలేయడంతో మనుషులకు,పశువులకు ప్రమాదం పొంచి ఉందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రధాన రహదారి ప్రక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వలన ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు.
ఓపెన్ ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ కంచె ఏర్పాటు చేయాల్సిన సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఈ రోడ్డు గుండా నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటారని, ట్రాన్స్ఫార్మర్ తక్కువ ఎత్తులో ఉండటంతో పొరపాటున అదుపుతప్పి అటువైపు వెళితే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని,అలాగే పశువులు, మేకలు,గొర్రెలు గడ్డి కోసం వెళ్లే ప్రమాదం ఉందని, ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ కవచాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.