యాదాద్రి భువనగిరి జిల్లా:నైజాం పరిపాలనలో బాంచన్ దొరా కాల్మొక్త అన్న చేతులకు బందూకులు పట్టిచ్చిన మహావిప్లవం తెలంగాణ సాయుధ పోరాటం.ఆ పోరాటంలో వన్నెతగ్గని పాత్ర వహించి,కడవరకూ పట్టిన జెండా వదలని వీరుడు ఉండ్రాతి రామయ్య వర్ధంతి వేడుకలు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల గ్రామంలో గురువారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ మునిపంపుల గడ్డపై ఇలాంటి యోధులు నడయాడారా అనే సందేహం నేటి తరంలో రావచ్చని,కానీ,మన చరిత్ర మనమే తెలుసుకోక ఆ స్పూర్తి భావితరాలకు అందించటంలో లోపం ఉందన్నారు.తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఉండ్రాతి రామయ్య చూపిన తెగువ,వీరోచితం అజరామరం అన్నారు.
ఆనాటి నల్లగొండ జిల్లా కడివెండి,సీతారాంపురం ప్రాంతంలో దొడ్డి కొమురయ్య అమరత్వంతో రామయ్య ఉత్తేజితమయ్యారని, కడివెండి,సీతారాంపురం ఏరియాల్లో ఇతడికి బంధువులు ఉండేవారని, ఎలమంద,కృష్ణమూర్తి దళాల్లో పనిచేశారని, తొలుత ఏటి అవతల అంటే మూసీనది అవతల కమ్యునిస్టు ఉద్యమం బలంగా ఉండేదని,ఎర్ర జెండా పట్టి నాయకులను ఏరు దాటించిన వీరుడు రామయ్య అని,ఆ జెండాను ఇస్కిళ్లలోని ఒక పెద్ద వేపచెట్టుపై కట్టానని రామయ్య చెప్పారన్నారు.ఉద్యమ సమయంలో అజ్ఞాతంలో ఉండగా ఒక గుట్టలో ఎలుగుబంటి తన కాలును గట్టిగా నోటితో పట్టిందని,దానితో పోరాడి దానిని తరిమేశాడని, గాయంతో బాధపడుతూనే పోరాటంలో పాల్గొన్న వీరుడని కొనియాడారు.
నిజాం లొంగుబాటు తర్వాత భూమి,భుక్తి కోసం నెహ్రూ,పటేల్ సైన్యాలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందని,ఆనాటి భయానక వాతావరణంలో పటేల్ సైన్యాలు దొరలు, పెత్తందార్ల వైపు నిలవగా మేము ఎర్రజెండాలు పట్టుకొని ఈ ప్రాంత రైతులు,పనిబాట్లోళ్లు, కూలినాలి జనం పక్షాన నిలబడి ప్రాణాలకు తెగించి పోరాటంలో పాల్గొన్నామని చెప్పేవారని తెలిపారు.రామయ్య పసరు వైద్యంతో తన కుటుంబాన్ని పోషించుకుంటూ తుదిశ్వాస వరకు కమ్యునిస్టు పార్టీలోనే ఉన్నారని,మునిపంపులలో సిపిఎం నుండి ప్రజాప్రతినిధిగా కూడా ఎన్నికయ్యారని,నిస్వార్థ జీవితానికి నిలువుటద్దంగా నిలిచిన రామయ్య జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం అన్నారు.
దొరల,పెత్తందారుల ఆధిపత్యాన్ని సహించని ధీటైన వారసత్వాలను తయారు చేయాలనేది రామయ్య ధృడ సంకల్పమని,అదే వరవడితో తన కుటుంబం కూడా కమ్యూనిస్టు వారసత్వం వైపు నడిపారన్నారు.రామయ్య 2007 జూన్ 6 అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారని,ప్రజల కోసం పని చేసిన వారు ప్రజల హృదయాల్లో నిరంతరం వెలుగొందుతారనే మాట రామయ్య లాంటి త్యాగధనులతో నిరూపితమవుతుందన్నారు.
వారు కలలుగన్న సమాజ స్థాపనే వారికి మనం అర్పించే ఘన నివాళి అని తెలిపారు.